న్యూఢిల్లీ, జనవరి 13: దేశంలో సైబర్ కేటుగాళ్లు కొత్త కొత్త మోసాలకు తెరతీస్తున్నారు. తాజాగా పశ్చిమ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.9 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు గత డిసెంబర్ 26న విద్యుత్ కనెక్షన్‌లో పేరు మార్పు కోసం తమ ప్రాంతంలోని విద్యుత్ శాఖను సంప్రదించి దరఖాస్తు చేసుకున్నాడు.
కార్యాలయం నుంచి బయటకొచ్చిన కొద్దిసేపటికే తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను విద్యుత్ పంపిణీ సంస్థ అధికారిగా పరిచయం చేసుకుని రూ.13 పెండింగ్ కరెంట్ బిల్లు చెల్లించాలని కోరాడు. తన దరఖాస్తు కొనసాగడానికి బాధితుడు అగంతకుడు సూచించిన విధంగా ఆన్ లైన్‌లో ఆ మొత్తాన్ని చెల్లించాడు.
ఆ తర్వాత అగంతకుడు బాధితుడికి మళ్లీ ఫోన్ చేసి తాము పంపించిన లింక్ ద్వారా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయమని సూచించాడు. బాధితుడు యాప్ ద్వారా తన పేరు మార్పు సమస్యను పరిష్కరిస్తారని భావించి డౌన్‌లోడ్ చేసుకుని తన వివరాలు నమోదు చేశాడు. దీంతో బాధితుడి స్మార్ట్ ఫోన్‌ను అగంతుకులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
డిసెంబర్ 29 నుంచి 31 మధ్య బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.9లక్షల వరకు స్వాహ చేశారు. తన ప్రమేయం లేకుండా డబ్బులు మాయం కావడంపై బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా సైబర్ టీమ్ విచారణ నిర్వహిస్తోంది. దేశంలో ప్రజలను బురిడి కొట్టించడానికి సైబర్ మోసగాళ్లు కొత్త దారులను ఎంచుకుంటున్నారు.
తాము నిజమైన అధికారులమని బాధితులను నమ్మించి, వారి విశ్వాసాన్ని పొంది మరి డబ్బులు కాజేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, బ్యాంకు సిబ్బంది ఎవరు కూడా ప్రజలను ఫోన్ ద్వారా, ఆన్‌లైన్‌లో సంప్రదించరని, కార్యాలయాల్లోనే బాధితుల సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు సైబర్ మోసగాళ్ల బారిన పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు.