calender_icon.png 7 October, 2024 | 9:02 AM

కూల్‌గా కుమ్మేసారు..

07-10-2024 12:58:02 AM

రెండ్రోజుల క్రితం కివీస్‌తో తడ‘బ్యాటు’. హర్మన్ సేనకు అంత వీజీ కాదనే వాదనలు. కానీ హర్మన్ బృందం అవేమీ పట్టించుకోకుండా చిరకాల ప్రత్యర్థి పాక్ పని పట్టింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయఢంకా మోగించింది. బౌలర్లు బెంబేలెత్తించగా.. బ్యాటర్లు కూడా తమ వంతు పాత్రను పోషించి పాక్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. హర్మన్‌సేనను కొట్టడం అంటే లంకేయులను గెల్చినంత వీజీ కాదని ఘాటు సందేశం పంపారు. పాక్ గెలుపు గాలి వాటమేనని రుజువు చేశారు. 

పాక్‌పై గెలిచిన హర్మన్ సేన

  1. అమ్మాయిల ఆల్‌రౌండ్ ప్రదర్శన 
  2. అపసోపాలు పడ్డ పాక్ బ్యాటర్లు
  3. మెరిసిన హైదరాబాదీ బౌలర్
  4. మహిళల టీ20 వరల్డ్ కప్

విజయక్రాంతి ఖేల్ విభాగం: ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 105 పరుగులు మాత్రమే చేసింది.

106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హర్మన్ సేన 7 బంతులు మిగిలుండగానే.. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. మూడు వికెట్లతో పాక్ నడ్డి విరిచిన అరుంధతీ రెడ్డికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 

బెంబేలెత్తించిన బౌలర్లు..

టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సన మొదట బ్యాటింగ్ తీసుకుంది. బౌలింగ్ ఆరంభించిన టీమిండియాకు తొలి ఓవర్లోనే రేణుకా సింగ్ శుభారంభం అందించింది. పాక్ ఓపెనర్ ఫెరోజా (0)ను క్లీన్ బౌల్డ్ చేసి భారత శిబిరంలో ఉత్సాహం నింపింది. పాకిస్తాన్‌కు టాస్ గెలిచిన సంబురమే కానీ తర్వాత ఎటువంటి సంతోషం మిగలలేదు.

వరుసపెట్టి వికెట్లను కోల్పుతూ వంద పరుగుల స్కోరు చేస్తారా? లేదా అనే అనుమానం లేవనెత్తారు. కానీ చివరికి మాత్రం 105 పరుగులు చేసి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. హైదరబాదీ బౌలర్ అరుంధతీ రెడ్డి 3 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించగా.. శ్రేయాంక పాటిల్ రెండు, ఆశా శోభన, రేణుకా సింగ్, దీప్తి శర్మ తలో వికెట్ తీసుకున్నారు.

నింపాదిగా... 

లక్ష్యం చిన్నదే కావడంతో భారత ఓపెనర్లు ఎటువంటి కంగారు లేకుండా నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. కానీ ఐదో ఓవర్లో ఓపెన్ మంధాన (7) హసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత రోడ్రిగ్స్‌తో కలిసి మరో ఓపెనర్ షఫాలీ జట్టు స్కోరును 50 పరుగులు దాటించింది. 61 పరుగుల వద్ద షఫాలీ ఔట్ కావడంతో క్రీజులోకి కెప్టెన్ కౌర్ (29*) వచ్చి భారత్‌కు విజయం కట్టబెట్టింది.

ఇండియా మరో వికెట్ పడకుండా గెలుస్తుందని అనుకున్నా కానీ రోడ్రిగ్స్ (23) ఔట్ కావడంతో వికెట్ కీపర్ రిచా ఘోష్ క్రీజులోకి వచ్చింది. కానీ ఘోష్ ఏ మాత్రం జోష్ తేకుండా సున్నా పరుగులకే వెనుదిరిగింది. వెనువెంటనే రెండు వికెట్లు పడడంతో ఏమవుతుందా అని అంతా కంగారు పడినా కానీ కెప్టెన్ కౌర్ భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. అయితే చివర్లో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి నిరాశపర్చింది. దీప్తి శర్మ (7*), సంజనా (4*) కలిసి లాంఛనం పూర్తి చేశారు. 

సంక్షిప్త స్కోర్లు

పాకిస్తాన్: 20 ఓవర్లలో 105/8 (నిదా దార్ 28, మునీబా అలీ 17; అరుంధతీ రెడ్డి 3/19, శ్రేయాంక పాటిల్ 2/12), భారత్: 18.5 ఓవర్లలో 108/4 (షఫాలీ వర్మ 32, హర్మన్ ప్రీత్ కౌర్ 29 నాటౌట్; ఫాతిమా సనా 2/23, ఒమియా సోహైల్ 1/17)