calender_icon.png 27 September, 2024 | 10:47 PM

ఇలా వచ్చారు.. అలా వెళ్లారు

26-09-2024 02:48:35 AM

వట్టెం రిజర్వాయర్ల ముంపు మోటార్లను సందర్శించని మంత్రులు

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): కరువు కాటకాలతో అల్లాడుతున్న ఉమ్మడి పాలమూరును సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో నెలకొల్పిన పాలమూరు ఎత్తిపోతల పథకం రెండు ప్రధాన పార్టీ మధ్య నలిగిపోతుంది. మూడు వారాల క్రితం కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు మూడవ లిఫ్ట్ వట్టెం పంపులు నీట మునిగిన సంగతి తెలిసిందే.

వరద నీటిని ఎత్తిపోసి పంపు మోటార్లను వినియోగంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈ నేపథ్యంలోనే భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి బుధవారం హెలిప్యాడ్ ద్వారా పాలమూరు ప్రాజెక్టు రిజర్వాయర్లు పనుల పరిశీలనకు శ్రీకారం చుట్టారు.

మంత్రులు వట్టెం రిజర్వాయర్‌ను సందర్శించకుండానే పర్యటన ముగించడం పట్ల విమర్శలొస్తున్నాయి. వరద నీటిని ఎత్తిపోసే ప్రక్రియ మరింత మందకొండిగా సాగే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో రూ.కోట్ల విలువ చేసే బాహుబలి మోటార్లు ప్రమాదంలో పడినట్లేనని విమర్శలొస్తున్నాయి. కేవలం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో రివ్యూ నిర్వహించి పొలిటికల్ విమర్శలకు పరిమితం అయ్యారు.