19-02-2025 06:17:59 PM
గాండ్ల కుమారస్వామి...
బెల్లంపల్లి (విజయక్రాంతి): కన్నెపల్లి మండలంలోని టేకులపల్లి గ్రామంలో గత నెల 17న తనపై జనకాపూర్ గ్రామానికి చెందిన గుల్భం రాకేష్, గుల్బం దుర్గ ప్రసాద్, గుల్బం శ్రీకాంత్ లు తనపై కర్రలతో దాడి చేసి అకారణంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని భీమిని మండల టిపిసిసి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గాండ్ల కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయని చెప్పారు. స్థానిక నాయకుల అండతోనే రాజకీయంగా తనను అనగదొక్కడానికి ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు.
మండలంలో ఇలాంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ ఆదరించవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న తనకే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుండాలుగా వ్యవహరిస్తున్న వీరి ఆగడాలను పోలీసులు అరికట్టాలని కోరారు. త్వరలోనే తాను వీరిపై రామగుండం సీపి, బెల్లంపల్లి ఏసీపి న్యాయం కోసం ఆశ్రయించనున్నట్లు తెలిపారు. తనపై జరిగిన దాడి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లండని చెప్పారు. తనపై దాడి చేసిన వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో కేసు పెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తనకు న్యాయం జరిగేలా చూడాలని బాధితుడు కుమారస్వామి కోరారు.