calender_icon.png 10 January, 2025 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగైదు ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగిన్రు..

10-01-2025 01:33:14 AM

  1. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు వస్తా.. లైడిటెక్టర్ పెట్టు
  2. ఓపెన్ లైవ్ పెట్టుకుందాం..
  3. ఎవరు దొంగో.. ఎవరు దొరో ప్రజలే చూస్తరు
  4. కేసు లేదు పీసు లేదు.. ఇదో లొట్టపీసు కేసు
  5. విచారణకు ఎన్ని సార్లు పిలిచినా వెళ్తా..
  6. భయపడే ప్రసక్తే లేదు.. కోర్టుల్లో తేల్చుకుంటాం
  7. ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్

హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): ఇది ముమ్మాటికీ లొట్టపీసు కేసే.. ఆయన లొట్టపీసు ముఖ్యమంత్రేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్ని అక్ర మ కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు విధించినా ప్రజల సంక్షేమం గురించి కేసీఆర్ సైనికుడిగా కాం గ్రెస్ ప్రభుత్వంపై  తాను మాట్లాడుతూనే ఉంటానని చెప్పారు.

గురువారం ఫార్ములా ఈ-రేస్ కేసు విషయంలో ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకొని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.. తనకోసం ఉదయం నుంచి సంఘీభావంగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపా రు. ఎన్ని సార్లు విచారణకు పిలిచినా తాను వెళ్తానన్నారు.

గత 10 సంవత్సరాలుగా అత్యంత నిబద్ధతతో, అవినీతి రహిత మంత్రిగా తన బాధ్యతలు నిర్వహించినట్లు ఏసీబీకి తాను చెప్పినట్లు తెలిపారు. ప్రశ్నలు అడిగే విషయంలో వారు కూడా ఇబ్బంది పడ్డారని, ఎందుకంటే కేసులో ఎలాంటి అవినీతి లేదన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడి తెచ్చిన ఫార్ములా ఈ-రేసు హైదరాబాద్ నగరంలో ఉండాలన్న ఉద్దేశంతో రేసును కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పానన్నారు.

కేవలం హైదరాబాద్ నగర ప్రతిష్ట కోసం, తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు తయారీకి కేంద్రంగా మార్చాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని వారితో చెప్పినట్లు తెలిపారు. సీఎం రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలనే 40 రకాలుగా.. అడిగిన ప్రశ్నలనే తిప్పితిప్పి అడిగారన్నారు.

ఏసీబీ అధికారులు 82 ప్రశ్నలు అడిగా రని, కాకపోతే పాడిందే పాటరా.. అన్నట్లు అడిగిం దే అడుగుడు.. తప్ప కొత్త విషయం లేదన్నారు. రేవంత్ బలవంతంగా కేసు పెట్టించాడని వాళ్లకు అర్థమైందని, ఎందుకంటే కేసులో విషయం లేదని పేర్కొన్నారు. 

అవసరమైతే చస్తా.. లుచ్చా పనులు చేయ

ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ విచారణకు హాజరయ్యేముందు బంజారాహి ల్స్ నందినగర్‌లోని నివాసంలో మీడియాతో మాట్లాడారు.. తాను అరపైసా అవినీతికి పాల్పడలేదని, ఏదో రకంగా బురదజల్లి తాత్కాలిక ప్రయోజనం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. అవసరమైతే చస్తా తప్ప.. లుచ్చా పనులు చేయనని తెలిపారు. 

ఆరున్నర గంటల పాటు విచారణ..

ఏసీబీ ఆఫీస్‌లో కేటీఆర్ విచారణ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దాదాపు ఆరున్నర గంటల పాటు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. తన లాయర్ రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు.

సీఎం కేటీఆర్.. సీఎం కేటీఆర్..

ఏసీబీ విచారణ ముగించుకుని తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్‌కు బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆయనకు సంఘీభా వం పలుకడానికి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో తెలంగాణ భవన్ ప్రాంగణం కిటకిట లాడింది. కేటీఆర్‌ను భుజాలపై ఎక్కించుకుని మోసుకుంటూ లోపలి వరకూ తీసుకెళ్లారు.

కేటీఆర్ వారిస్తున్నా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి భుజా లపై మోశారు. కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ నినాదాలు హోరెత్తించారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న కేటీఆర్‌కు సోదరి కవిత, భార్య శైలిమా బొట్టు పెట్టి హారతిచ్చి దిష్టి తీశారు. 

న్యాయస్థానాలపై నమ్మకం ఉంది..

సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రశ్నలు పట్టుకొని మళ్లీ పిలిస్తే వెళ్తానని చెప్పారు. అవినీతి లేని కేసులో అవినీతి గురించి అడిగే ప్రశ్న ఎక్కడిదని, ఆ ఫైల్ ఎక్కడ పోయింది.. ఈ ఫైల్ ఎక్కడ పోయిందని అధికారులు తనను అడిగారన్నారు. ఫార్ములా ఈ-రేస్ ఈవెంట్‌ని హైద రాబాద్‌లో నిర్వహించాలని, కష్టపడి తొలిసారి భారత్‌కు తీసుకొచ్చినట్లు తెలిపారు.

న్యాయస్థానాలు, కోర్టులపై నమ్మకం ఉందని.. తప్పకుండా సహకరిస్తామన్నారు. “ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను పెట్టాలన్న కమిట్మెంట్ తమది.. తమ నాయకుడు కేసీఆర్‌”ది అన్నారు. రూ.50 లక్షల నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగలం తాము కాదని, తమకు భయం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.

‘సంవత్సరం తర్వాత కూడా నిన్ను ప్రజలు గుర్తుపట్టకపోతే మేమేమి చేయాలి.. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండ పెట్టినట్టు ఉన్నది తెలంగాణలో పరిస్థితి’ అం టూ విమర్శించారు. ఈ ఏడాదంతా ప్రజల సమస్యల గురించే మాట్లాడుతామన్నారు.

ఎగ్గొట్టిన రైతు భరోసా, రూ.4 వేల పెన్షన్ గురించి, ఇస్తాననని చెప్పి మోసం చేసిన మహాలక్ష్మి రూ. 2,500, 2 లక్షల ఉద్యోగాల గురిం చి మాట్లాడుతామని చెప్పారు.  కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పు డూ ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు.

నీకు దమ్ముంటే లైడిటెక్టర్ పెట్టు..

ఫార్ములా ఈకార్ రేసింగ్ వ్యవహారంలో చర్చించేందుకు నీకు దమ్ముంటే లైడిటెక్టర్ పరీ క్ష పెట్టు అని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవా ల విసిరారు. ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకున్నాక కేటీఆర్ మీడియాతో మాట్లాడారు..“పచ్చ కామెర్ల వాడికి లోకమం తా పచ్చగానే కనపడ్డట్టు..రేవంత్ రెడ్డి లాంటి దొంగకు అన్నింట్లో కూడా దొంగతనం జరుగుతది..

అన్నింట్లో పైసలు తింటారనే దిక్కు మాలి న ఆలోచన ఉండొచ్చు కానీ.. నేను ఒక్క పైసా అవినీతి చేయలేదు.. రేవంత్ రెడ్డి గారు మీరు రేపు రండి.. లేదంటే మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు రమ్మంటే వస్తా.. ఇద్దరం కూర్చుందాం.. నువ్వు లైడిటెక్టర్ పెట్టు.. ఓపెన్ కెమెరాలు పెట్టుండ్రి.. నేను మాట్లాడుతా.. నువ్వు మాట్లాడు.. ఎవడు దొంగనో.. ఎవడు దొరనో.. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు చూస్తరు.. తేల్చుకుందాం.. పాపం అధికారులను చంపుడు.. వాళ్లను సతాయించుడు ఎందుకు..” అని స్పష్టం చేశారు.