calender_icon.png 2 October, 2024 | 5:57 AM

మొదలుపెట్టిందే వారు

02-10-2024 03:10:17 AM

2017లో మూసీ కార్పొరేషన్ ప్రారంభించిందెవరు?

  1. ఆనాడే హడావిడి చేసిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం 
  2. ఇప్పుడు మేము చేస్తుంటే రాద్ధాంతమెందుకు?
  3. పేద ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు
  4. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయ క్రాంతి): మూసీనది ప్రక్షాళన కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులనే ఇప్పుడు తాము కొనసాగిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ శ్రీధర్‌బాబు తెలిపారు. 2017లో మూసీ ప్రక్షాళన పేరుతో ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ను ఏర్పాటు చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.

ఇప్పుడు అదే పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని నిలదీశారు. మంగళవారం సచివాలయంలో మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో నివసించే ప్రజలకు శుభ్రమైన నీరు, స్వచ్ఛమైన గాలి అందించడమే లక్ష్యంగా హైడ్రా ద్వారా చర్యలు చేపట్టామని తెలిపారు.

పేదవారిని నిలబెట్టే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంటే బీఆర్‌ఎస్ మాత్రం అనవసర రాజకీయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.   2017 లో మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుచేసి, ఆర్భాటంగా దానికి చైర్మన్‌ను కూడా నియమించారని గుర్తుచేశారు.

అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ అనేక సమావేశాలు నిర్వహించి మూసీ ప్రక్షాళనకు కార్యాచరణను కూడా రూపొందించడంతోపాటు ఆక్రమణల లెక్కలు తీయాలని నిర్ణయించారని తెలిపారు. 

ప్రతిపక్షాల తీరుతో సమస్య జటిలం

భావితరాలకు మంచి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరాటపడుతుంటే ప్రతిపక్ష పార్టీ  అభివృద్ధికి అడ్డుపడుతుంటే విశ్వనగరం ఎలా సాధ్యమవుతుందని మంత్రి ప్రశ్నించారు. గతంలో వారు చేస్తే ఒప్పు.. అదే పని తాము చేస్తే తప్పా? అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన క్లిష్టమైన ప్రాజెక్టేనని, దానికి పరిష్కారం కోసం ఆలోచించాలని సూచించారు.

మూసీ సుందరీకరణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రతిపక్ష పార్టీ సలహాలిస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ ఆ పని చేయకుండా బీఆర్‌ఎస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని, సమస్యను మరింత జటిలం చేస్తుందని మండిపడ్డారు. ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మల్లన్నసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రజలపై ఎందుకు కనికరం చూపలేదని నిలదీశారు.

పేద, మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పెట్టే పని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ చేయదని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన నిర్వాసితులకు ఇళ్లు, ఉపాధితోపాటు వారి పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిర్వాసితుల్లో కూడా చాలా మంది స్వచ్ఛందంగా ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్‌రూం ఇండ్లల్లోకి వెళ్తున్నారని తెలిపారు. 

ఇబ్బంది కలుగకుండా ప్రక్షాళన

ప్రస్తుతం తలెత్తిన సమస్యలపై మరొకసారి అందరితో చర్చించిన తర్వాత చర్యలు చేపడతామని శ్రీధర్‌బాబు తెలిపారు. బఫర్ జోన్‌పై కొందరికి సందేహాలున్నాయని, వాటిని తీర్చేందుకే హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. మూసీ ప్రక్షాళనతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్ పార్టీ ఈ అంశంపై రాజకీయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంచి చేసే ఉద్దేశం ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేయాలని, కానీ బీఆర్‌ఎస్ పార్టీ అనవసరంగా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా లాభం పొందాలని చూస్తున్నదని మండిపడ్డారు. పేద, మధ్య తరగతి వారికి ఇబ్బంది కలుగకుండానే మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో మూసీ నిర్వాసితులకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇళ్లు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని వారికి న్యాయం చేస్తామన్నారు. సమా వేశంలో ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, విజయరమణరావు, గండ్ర సత్యనా రాయణ, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొన్నారు.

బఫర్‌జోన్ నిర్ధారించిందే మీరు..

మూసీ రివర్ బఫర్‌జోన్‌ను ఒక నెలలోనే తేల్చాలని బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. మూసీ అభివృద్ధిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, ఆ సమయంలో గుర్తించిన 8,480 అక్రమ కట్టడాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చాలని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదేశించిందని మంత్రి తెలిపారు.

గత ప్రభుత్వం మూసీ రివర్ బెడ్ బౌండరీకి సంబంధించి 50 మీట ర్ల బఫర్ జోన్‌గా నిర్ధారించిందని, ఆ జీవో ప్రకారమే తాము కూడా నడుచుకుంటున్నామని స్పష్టం చేశారు. మూసీని ప్రక్షాళన చేయాలనుకున్నా.. వారు దానిని మాటలకే పరిమిత చేశారని విమర్శించారు. గతంలో అనేక సందర్భాల్లో వరదలు, ముంపు కారణంగా చాలా మంది ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ ప్రాంతాల్లో ఉండే వారికి ప్రమాదం ఉందని, వారికి వేరే ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని స్థానికులు కూడా కోరుతున్నారని వెల్లడించారు. వరదలతో పొంచి ఉన్న ముప్పుపై గతంలో అధికారులు చేసిన సర్వే ఆధారాలు ఉన్నాయని తెలిపారు.