calender_icon.png 16 November, 2024 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురిటిలోనే చిదిమేస్తున్నరు!

10-11-2024 12:03:59 AM

  1. గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు 
  2. ఆడపిల్ల అని తేలితే గర్భవిచ్ఛిత్తే..
  3. వనపర్తి, గద్వాల జిల్లాల్లో జోరుగా దందా
  4. స్కానింగ్ కేంద్రాల తనిఖీలపై అధికారుల నిర్లక్ష్యం 

* వనపర్తి, గద్వాల జిల్లాల్లో జోరుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి, కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తేలితే అబార్షన్లు చేస్తున్నట్లు బహరింగ విమర్శలొస్తున్నాయి. వివిధ కారణాలతో గర్భం దాల్చిన వారు, ఇతర కారణాలతో వచ్చిన వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వైద్యులు, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు వ్యాపారంగా మలుచుకుంటున్నారు. కొందరు ఆర్‌ఎంపీలు ప్రత్యేక చొరవ తీసుకుని కర్నూల్ వంటి మహానగరంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి అబార్షన్లు సైతం చేయిస్తున్నట్లు సమాచారం. 

వనపర్తి, నవంబర్ 9 (విజయక్రాంతి): వనపర్తి, గద్వాల జిల్లా కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షల దందా జోరుగా కొనసాగుతు న్నది. ప్రజ ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ రూ. లక్షల్లో దండుకుంటున్నట్లు జోరుగా ప్రచారంలో ఉంది.

తగ్గి పోతున్న ఆడపిల్లల సంఖ్యను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్న ప్పటికీ కొందరు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని ఆడపిల్ల అని తేలితే తల్లి గర్భంలోనే చిదిమేస్తున్నారు.

కాసులకు కక్కుర్తి పడి పలు స్కానింగ్ సెంటర్లు, దవాఖానల నిర్వాహకులు కడుపులో పెరుగు తోంది ఆడ బిడ్డా, మగబిడ్డా అనేది ప్రసవానికి ముందే నిర్ధారిస్తున్నారు. ఇంత జరుగు తున్నప్పటికీ సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. 

పేరుకే ఆసుపత్రిల్లో బోర్డులు 

వనపర్తి, గద్వాల, అలంపూర్, అయిజ పట్టణాలతో పాటు పలు ప్రాంతాల్లో అన్ని ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని చెప్పే బోర్డులను ప్రదర్శిస్తున్నారు. కానీ అందుకు విరుద్ధంగా నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. పలువురు ఆర్‌ఎంపీలు, పీఎంపీలు, కొంత మందిని నియమించుకుని లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

దంపతుల అవసరాలను ఆసరాగా చేసుకుని రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పరీక్షల కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టి, రెండవ, మూడవసారి గర్భం దాల్చిన మహిళలు అధిక సంఖ్యలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నట్లు తెలుస్తున్నది. 

నిబంధనలు ఇలా

కడుపులో పెరుగుతున్న బిడ్డకు జన్యుపరమైన లోపాలు, పెరుగుదల ఎలా ఉందో తెలుసుకునేందుకే స్కానింగ్ నిర్వహించాలి. కడుపులోని బిడ్డ ఆడ, మగ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదు. లింగ నిర్ధారణకు సహకరించిన వారికి మూడు నెలల జైలు శిక్షతో పాటు రూ.50వేల జరిమాన విధించే అవకాశముంది. వైద్యులు దోషులుగా తేలితే లైసెన్స్‌ను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సిఫార్సు చేసి కొద్ది రోజులు రద్దు చేసే అవకాశముంది. లింగ నిర్ధారణ చేయాలని కోరినా మూడేండ్లు జైలు శిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తారు. 

ఇష్టారీతిగా అబార్షన్లు

మారుతున్న కాలానికి అనుగుణంగా ఆడపిల్ల అని తెలిసిన వెంటనే సదరు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కుటుంబ పోషణను దృష్టిలో ఉంచుకుని పురిటిలోనే చంపేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు అనుకూలంగా ఉన్న ఆసుపత్రులతో పాటు స్కానింగ్ సెంటర్లలో అబార్షన్లు చేయిస్తున్నారు.

ఇదే అదునుగా ఎలాంటి నిబంధనలను పాటించని కొన్ని మెడికల్ దుకాణాలు లేదా చిన్నపాటి ఆర్‌ఎంపీ క్లినిక్ నిర్వాహకులు డబ్బులు దండుకుంటున్నారు. అబార్షన్లు  చేసే క్రమంలో కనీస అవగాహన లేకుండా ఆడపిల్లను చిదిమేసేందుకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కానీ తమకేమీ సంబంధం లేనట్లుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉండటంతో ఈ వ్యవహారం శృతి మించుతోంది. 

లింగ నిర్ధారణ చేస్తే చర్యలు

లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రతి అబార్షన్‌ను నిశితంగా పరిశీలిస్తాం. ఎందుకోసం అబార్షన్ చేయాల్సి వచ్చింది అనే అంశాలపై ప్రతి నెల సమీక్ష చేస్తాం. లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తే ఎంతటి వారినైనా సహించేది లేదు. ఎవరికైనా సమాచారం తెలిస్తే ఫిర్యాదు చేయవచ్చు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. 

 జయచంద్ర మోహన్, 

జిల్లా వైధ్యాధికారి, వనపర్తి