- ‘సుంకిశాల’పై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవట్లే
- పొంగులేటి అక్రమ సంపాదనపై జైలు తప్పదు
- కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య చీకటి ఒప్పందాలు
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): మేఘా కంపెనీతో కుమ్మక్కై రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో దోచుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నార ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మేఘా సంస్థను గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చిన ముఖ్యమంత్రి.. దాని అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మేఘా కంపెనీ నిర్లక్ష్యంతో సుంకిశాలలో రిటైనింగ్‌వాల్ కూలిపోతే, విష యం బయటకు రాకుండా ఎందుకు దాచిపెట్టిందని ప్రశ్నించారు.
సుంకిశాల ప్రమాదం లో నలుగురు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకొందని, కాంట్రాక్ట్ సంస్థను మాత్రం బ్లాక్ చేయలేదని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తమపై బాంబులు వేయడం కాదు.. త్వరలో అక్రమాస్తులపై ఆయన అరెస్టు తప్పదని అన్నా రు. బీజేపీతో చేతులు కలిపి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాఘవ కంపెనీ అక్రమాలు వెలికితీసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి ప్రభుత్వ అధికారులు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెడుతున్నారని, తరువాత గుణపాఠం తప్పదని అన్నారు.
గతంలో తిట్లు.. నేడు తీపి
మేఘా ఇంజనీరింగ్ సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని గతంలో రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి విమర్శించారని.. ఇప్పడు అదే సంస్థకు ప్రాజెక్టులు కట్టబెట్టడం వెనక మతలబు ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు పొంగులేటి, మేఘా సంస్థకు ప్రాజెక్ట్‌లు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
స్కిల్ యూనివర్సిటీకి రూ.200 కోట్ల విరాళం ఇచ్చినందుకే రూ.4,350 కోట్ల కొడంగల్ లిఫ్ట్ టెండర్‌ను మేఘాకు అప్పగించారని ఆరోపించారు. కాళేశ్వరం నీళ్లను గండిపేటలో కలిపి మూసీలోకి తరలిస్తామని.. ఇందుకోసం రూ.5,500 కోట్లు ఖర్చు చేయడం పెద్ద కుంభకోణమని విరుచుకుపడ్డారు. ఈ ప్రాజెక్ట్‌ను కూడా మేఘాకే ఇవ్వటానికి అన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు.
ప్రతిపక్ష నేతలుగా ఈ విషయాన్ని ప్రజలకు ముందే చెప్తున్నామని అన్నారు. ఆరు గ్యారెంటీలు, హామీలు అమలు చేసేందుకు, ఉద్యోగులకు డీఏ ఇచ్చేందుకు పైసలు లేవన్న రేవంత్ సర్కార్.. మూసీ ప్రాజెక్టు పనులను మేఘాకే ఇవ్వటానికి అన్ని సిద్ధం చేసుకున్నట్టు తెలిసిందని చెప్పారు.
తెలంగాణ నుంచి ఇప్పటికే మహారాష్ర్టకు డబ్బుల మూటలు తరలించారని, త్వరలో ఢిల్లీకి కూడా ఈ కంపెనీ ద్వారా పంపిస్తారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సహాయ మంత్రి అయిన బండి సంజయ్ ఎందుకు దీని మీద మాట్లాడటం లేదని నిలదీశారు. బావమరిదికి అమృత్ టెండర్లు, మేఘా, రాఘవ సంస్థలకు ప్రాజెక్ట్‌లను రేవంత్ పంచుతున్నాడని ఆరోపించారు.
ఇంత బహిరంగంగా దోపిడీ చేస్తుంటే ఈడీలు, విజిలెన్స్‌లు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ మీదికి మాత్రమే ఈడీ, విజిలెన్స్ అంటూ వస్తారని, పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులకు సంబంధించి రెండు పార్టీ నాయకులు ఎందుకు నోరు మెదపరని అడిగారు.
కోహినూర్ హోటల్‌లో అదానీ కాళ్లు మొక్కి ఏమీ చేయకుండా పొంగులేటి బతిమిలాడుకున్నాడని విమర్శించారు. మోదీ కోసం దామగుండం, అదానీకి సిమెంట్ ఫ్యాక్టరీ, మేఘా కృష్ణారెడ్డికి అన్ని ప్రాజెక్ట్‌లు ఇస్తున్నారు. రాయదుర్గంలో 84 ఎకరాలను కూడా ఆదానీకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.