calender_icon.png 12 October, 2024 | 3:26 AM

రాజకీయంగానూ ‘వెనుక’బడ్డారు!

11-09-2024 03:37:12 AM

  1. జనాభాకు తగ్గట్టు బీసీలకు దక్కని ప్రాధాన్యం
  2. దేశ జనాభాలో 45 శాతం, తెలంగాణలో 51 శాతం బీసీలు
  3. లోక్‌సభలో 25 శాతం, అసెంబ్లీలో 16 శాతమే ప్రాతినిధ్యం
  4. రాష్ట్రంలో 70 ఏండ్లలో బీసీలకు పెరిగింది 10 సీట్లే

హైదరాబాద్, సెప్టెంబర్ ౧౦ (విజయక్రాంతి): సమాజంలో ప్రజల మధ్య నెలకొన్న అసమానతలను తొలగిం చేందుకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లను రూపొందించారు. కానీ, ఆ రిజర్వేషన్ల ద్వారా ప్రజలకు అన్ని రంగా ల్లో, అన్ని అంశాల్లో ఒకే విధంగా లబ్ధి చేకూరడం లేదు. అయితే దీనివల్ల అత్యంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నది మాత్రం బీసీలే. వెనుకబడిన తరగతులు.. అప్పు డున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా వారు వెనుకబడి ఉన్నారని ఆ పేరు నిర్ధారించారు.

అందులో ప్రధానమైనది రాజకీయ రంగం. సామాజికంగా బీసీల పరిస్థితి కొంతవరకు మెరుగైనప్పటికీ రాజకీయంగా మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాధాన్యం లభించడం లేదు. జనాభా ప్రకారం దేశంలో అధికంగా బీసీలే ఉన్నప్పటికీ రాజకీయంగా, చట్ట సభల్లో ప్రాతినిధ్యం పరంగా వారి హక్కులను పొందడంలో వెనుకబడుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం జనాభాలో బీసీలే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం దేశంలో 142 కోట్ల జనాభా ఉంటే అందులో సుమారు 60 కోట్ల వరకు బీసీలే ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి.

అంటే, దేశ జనాభాలో 45 శాతం వెనుకబడిన తరగతులే. కానీ, ఆ స్థాయిలో లోక్‌సభలో ప్రాతినిధ్యం మాత్రం లభించడం లేదు. ప్రస్తుతం లోక్‌సభకు ఎన్నికైన బీసీలు కేవలం 25 శాతమే. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు కొంతమేరకు వారి జనాభా స్థాయిలో ప్రాతినిధ్యం పొందుతున్నప్పటికీ బీసీలు చాలా వెనుకబడే ఉన్నారు. అయితే రిజర్వేషన్ల ద్వారా రాజకీయంగా ఓసీలే ఎక్కువగా లాభపడుతున్నట్టు గణాంకాలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. 45 శాతం ఉన్న బీసీలకు 25 శాతం ప్రాతినిధ్యం లభిస్తే.. 35 శాతానికి లోపే ఉన్న ఓసీలకు 25.8 శాతం ప్రాతినిధ్యం లభించింది. 

అగ్రకులాలదే ఆధిపత్యం 

రాష్ట్రంలో బీసీల ప్రాతినిధ్య స్థాయి మరి దారుణంగా ఉంది. తెలంగాణలో మూడున్నర కోట్లకుపైగా ఉన్న జనాభాలో బీసీలే 1.85 కోట్లకు పైగా ఉన్నారు. బీసీలు 51 శాతం ఉండగా, ఓసీలు 21 శాతం, ఎస్సీలు 17 శాతం, ఎస్టీలు 9 శాతం, ఇతరులు 2 శాతం ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, అసెంబ్లీలో ప్రాతినిధ్యం విషయంలో కనీస భాగాన్ని కూడా బీసీలు పొందడం లేదు. జనాభాలో 21 శాతం ఉన్న ఓసీలు అసెంబ్లీలో 52 శాతం ప్రాతినిధ్యాన్ని కలిగి ఉంటే.. 51 శాతం జనాభా ఉన్న బీసీలు మాత్రం 16 శాతానికే పరిమితమయ్యారు. రాష్ట్ర రాజకీయంలో ఓసీల ఆధిపత్యం, బీసీల వెనుకబాటుతనం దీన్నిబట్టి స్పష్టంగా తెలుస్తోంది. రిజర్వేషన్ల ద్వారా సామాజిక అసమానతలు తొలగిపోతున్నప్పటికీ రాజకీయంగా మాత్రం అగ్రకులాల ఆధిపత్యం ఎప్పటిలాగానే కొనసాగుతుంది. 

ఏడు దశాబ్దాల్లో పెరిగింది 10 సీట్లే 

దేశంలో ఎన్నికల నిర్వహణ మొదలై 70 ఏండ్లకుపైగా గడుస్తున్నా రాష్ట్రంలో బీసీల ప్రాతినిధ్యంలో గణనీయమైన మార్పేమీ కన్పించడం లేదు. 1952లో మొదటిసారి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు మొత్తం 102 సీట్లు ఉండగా అందులో 63 మంది సభ్యులు ఓసీలే. నాటి సభలో బీసీలు కేవలం తొమ్మిది మందే ఉన్నారు. మొదటి అసెంబ్లీలో ఓసీలు 61 శాతం కాగా.. బీసీలు 9 శాతం లోపే. అసెంబ్లీలో ఓసీల ప్రాతినిధ్యం ఇప్పటికీ అదేవిధంగా కొనసాగుతోంది. బీసీల ప్రాతినిధ్యం కొద్దిగా పెరిగినప్పటికీ వారి జనాభా ప్రకారం గుర్తించాల్సిన స్థాయి పెరుగుదల కాదని అభిప్రాయముంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో 62 మంది ఓసీ సభ్యులుండగా, 19 మంది బీసీ సభ్యులున్నారు.

అయితే ఎస్సీ, ఎస్టీలకు ఎన్నికల్లో ప్రత్యేక రిజర్వేషన్ ఉండటంతో దాని ప్రాతిపదికన వారు ప్రాతినిధ్యం పొందుతూ వస్తున్నారు. మొత్తంగా ఎన్నికల నిర్వహణ మొదలై 70 ఏండ్లు దాటుతున్నా.. అసెంబ్లీలో బీసీ సభ్యుల సంఖ్యమాత్రం కేవలం 10 మందే పెరగడం గమనార్హం. మధ్యలో కొంతవరకు బీసీల ప్రాతినిధ్యం పెరుగుతున్నట్టు కన్పించినా ఆ తర్వాత మళ్లీ తగ్గింది. రిజర్వేషన్ల ద్వారా బీసీలు తమ హక్కులు పొందే లక్ష్యం కేవలం చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం పెంచుకోవడం ద్వారానే సాధ్యమవుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.