calender_icon.png 16 January, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవి ఔషధ ఉత్పత్తులే..

14-07-2024 12:37:56 AM

పాతికేళ్ల వివాదానికి హైకోర్టు తెర

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): నవరతన్ ఆయిల్, గోల్ టర్మరిక్ ఆయుర్వేదిక్ క్రీమ్, బోరోప్లస్ యాంటిసెప్టిక్ క్రీమ్, బోరోప్లస్ ప్రిక్లీ హీట్ పౌడర్, సోనాచండీ చవన్‌ప్రాష్ వంటి ఆయుర్వేద ఉత్పత్తులు ఔషధాల పరిధిలోకే వస్తాయని హైకోర్టు తీర్పు చెప్పింది. జీఎస్టీ విధింపు కూడా ఆ మేరకే చేపట్టాలని సూచించింది. ఆ ప్రోడక్ట్స్ సౌందర్య సాధనాల పరిధిలోకి వస్తాయని నిరూపించడంలో సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్లు ఫెయిల్ అయ్యారని ఆక్షేపించింది. పాతికేళ్లుగా కొనసాగుతున్న ఈ వివా దం హైకోర్టు తీర్పుతో కొలిక్కి వచ్చింది.

అవి ఆయుర్వేద ఉత్పత్తుల ఔషధాల పరిధిలోకి వస్తా యో లేదో లేదా లేక సౌందర్య సాధనాల పరిధిలోకి వస్తాయా అనే వివాదం 1997 నుంచి నెలకొంది. అప్పటి ఉమ్మడి ఏపీ సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్లు వీటిని సౌందర్య సాధనాల కిందకు వస్తాయని చెప్పి అందుకు అనుగుణంగా ట్యాక్స్లు చెల్లించాలని కోరారు. దీనిపై హిమాని లిమిటెడ్, ఇమామి లిమిటెడ్ అప్పటి సేల్స్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించా యి. బోరోప్లస్ యాంటిసెప్టిక్ క్రీమ్, బోరోప్లస్ ప్రిక్లీ హీట్ పౌడర్, సోనాచండీ చవన్ ప్రాష్ ఔషధాల పరిధిలోకి వస్తాయని, మిగిలిన రెండు సౌందర్య సాధనాలని ట్రిబ్యునల్ తేల్చింది.

ఆ తీర్పును సవాల్ చేస్తూ 2004లో సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్లు హైకోర్టులో వేర్వురుగా 11 అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇవి విచారణ దశలో ఉండగానే జీఎ స్టీ అమల్లోకి వచ్చింది. ఔషధాల కింద పరిగణిస్తే 10 శాతం పన్ను పరిధిలోకి, సౌందర్య సాధనాల కింద పరిగణిస్తే 20 శాతం పన్ను పరిధిలోకి ఆ ఉత్పత్తులు వస్తాయి. ఇవి ఔషధాల పరిధిలోకే వస్తాయని జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ ఎన్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది. సేల్స్ ట్యాక్స్ అప్పీళ్లను డిస్మిస్ చేసింది. కంపెనీల వాదనలను ఆమోదించింది.

మైనారిటీ వెల్ఫేర్ టీచర్ల ట్రాన్సఫర్ గైడ్‌లైన్లపై స్టే

రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూషన్స్ సొసైటీ అధీనంలోని విద్యా సంస్థల్లో చేసే హెడ్మాస్టర్లు, టీచర్ల ట్రాన్సఫర్లకు ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే జారీ చేసింది. ఈ నెల 18న జరిగే తదుపరి విచారణ వరకు స్టే అమల్లో ఉంటుందని వెల్లడించింది. గురుకుల సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా జూలై 6న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంటూ హేమలత, ఇతర టీచర్లు వేసిన పిటిషన్ల విచారణ తర్వాత జస్టిస్ పుల్ల కార్తీక్ ఇటీవల స్టే విధిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు.

గురుకుల సిబ్బందిని తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ రూల్స్ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం 2022లో ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్ల వాదన. దీనిపై గతంలోనే హైకోర్టు స్టే ఇచ్చిందని, ఈ పరిస్థితుల్లో ట్రాన్సఫర్ గైడ్‌లైన్స్  జారీ చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. వాదనల తర్వాత స్టే ఇచ్చిన హైకోర్టు, గురుకులాల కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.