calender_icon.png 5 February, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారు నినాదాలకే పరిమితం

05-02-2025 01:08:40 AM

కొంత మందికి సోకుల మీదే దృష్టి మూడోసారి మామీద నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు

  1. కేజ్రీవాల్‌పై ప్రధాని ఆరోపణలు

25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం

12 కోట్ల ఇండ్లకు మంచినీళ్లిచ్చాం

లోక్‌సభలో ప్రధానమంత్రి..  

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడారు. మంగళవారం ఆయన పార్లమెంట్‌లో పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

‘కొద్ది రోజుల క్రితం పేపర్ హెడ్‌లైన్లలో కేవలం స్కాములు, అవినీతి గురించి మాత్రమే ఉండేది. ఈ పదేండ్ల కాలంలో కోట్ల రూపాయల ధనాన్ని స్కాముల నుంచి రక్షించి ప్రజల బాగు కోసం ఖర్చు చేశాం. కానీ ఆ డబ్బుతో “శీష్‌మహల్‌”ను మేము నిర్మించుకోలేదు. ఆ డబ్బును దేశ ప్రజల శ్రేయస్సు కొరకు ఉపయోగించాం’. అని మోదీ తెలిపారు. 

“గరీబీ హఠావో” విఫలమైంది

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన “గరీబీ హఠావో” నినాదం మీద కూడా మోదీ మాట్లాడారు. ‘వారి నినాదం విఫలమైంది. ఐదు దశాబ్దాలుగా “గరీబీ హఠావో” అని నినదించారు. కానీ ఏం చేయలేకపోయారు. బీజేపీ మాత్రం ఇప్పటికే దాదాపు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసింది.

అంతే కాకుండా పేదవారికి 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. మహిళల జీవనం మరింత సులభం చేశాం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా దేశంలో 16 కోట్ల ఇండ్లకు తాగునీరు లేకుండా ఉండేది.

కానీ  ఐదేండ్లలో మా ప్రభుత్వం “నల్ సే జల్‌” పథకం కింద 12 కోట్ల ఇండ్లకు కుళాయి సౌలభ్యం కల్పించింది. కొంత మంది ఫొటోల కోసం పేదవారి గుడిసెల వద్దకు వెళ్తారు. వారి సొంత వినోదం కోసం ఎన్నో చేస్తారు’ అని మోదీ ఆరోపించారు. 

కుల ప్రస్తావన ఫ్యాషన్ అయిపోయింది

‘2014కు ముందు దేశంలో 317 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం దేశంలో 780 మెడికల్ కాలేజీలున్నాయి. మెడికల్ సీట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. కులం గురించి పదే పదే మాట్లాడడం కొంత మందికి ఫ్యాషన్ అయిపోయింది.

ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలకు ఎంతో మేలు చేశాం. రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని తిరిగే వారికి ముస్లిం మహిళల జీవితాల్లోని దుర్భరపరిస్థితులు తెలియవు. కొన్ని కుటుంబాలు ఢిల్లీలో మ్యూజియాలు నిర్మించుకున్నాయి. కానీ మేము మాత్రం మాజీ ప్రధానుల కోసం మ్యూజియాన్ని నిర్మించాం’ అని ప్రధాని తెలిపారు. 

10 కోట్ల నకిలీలను తొలగించాం

‘10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను గుర్తించి తొలగించాం. సరైన లబ్ధిదారులను గుర్తించి పథకాలు అందిస్తున్నాం. రూ. 3 లక్షల కోట్లు నకిలీల చేతుల్లోకి వెళ్లకుండా రక్షించాం. రూ. 40 లక్షల కోట్లను ఎన్డీయే ప్రభుత్వం నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేర్చింది.

గతంలో ఢిల్లీ నుంచి వెళ్లే రూపాయిలో 15 పైసలు మాత్రమే గ్రామాలకు చేరుకుంటున్నాయని స్వయంగా ప్రధానే ప్రకటించారు. కానీ నేడు ఆ పరిస్థితి లేకుండా చేశాం. ఆ సమయంలో ఒకే పార్టీ అధికారంలో ఉండేది.

ఆ సమస్య నుంచి బయటపడేందుకే జన్‌ధన్ ఖాతాలు, ఆధార్ కార్డులు ప్రవేశపెట్టాం. వాటి ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నిధులు జమ చేస్తున్నాం.

గత పదేండ్లలో 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి బయట పడేశాం. ఆయుష్మాన్ భారత్‌ను 30 వేల ఆ సుపత్రులకు విస్తరించాం. కొంత మంది మాత్రం ఈ పథకం నుంచి పేదలను దూరం గా ఉంచారు’ అని ప్రధాని ఆరోపించారు. 

వక్ఫ్ బిల్లు వల్ల లబ్ధి పొందేది వారే.. 

‘వక్ఫ్ బిల్లు వల్ల పేద ముస్లింలు, వితంతువులే ఎక్కువ ప్రయోజనం పొందుతారు.  ట్రిపుల్ తలాక్ రద్దు వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలిగాయో.. ఈ బిల్లు వల్ల కూడా అ లాగే ప్రయోజనాలు కలుగుతాయి’ అని జే పీసీ చైర్మన్ జగదాంబికా పాల్ అన్నారు. 

ఒంటి గంటకు తొక్కిసలాట జరిగితే 11 గంటలకు అంబులెన్సులు

కుంభమేళాలో ఒంటిగంటకు తొక్కిసలాట ఘటన జరిగితే 11 గంటలకు అంబులెన్సులు ప్రమాదస్థలికి వచ్చాయని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. చాలా మంది భక్తులు పుణ్యస్నానాలు కూడా చేయలేదు. సీఎం యోగి మాత్రం 100 కోట్ల మందికి ఏర్పాట్లు చేశామని చెప్పారు. కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు అని అఖిలేష్ అన్నారు. 

రాహుల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం ధీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మా నం ప్రవేశపెట్టాలని బీజేపీ చూస్తున్నట్లు సమాచారం. మొన్న పార్ల మెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగం తనకు బోర్ కొట్టించిందని రాహుల్ ఆరోపించారు.

సోమవారం పార్లమెంట్‌లో మాట్లాడిన రాహుల్ గాంధీ పదే.. పదే చైనా పేరును ప్రస్తావించారు. అంతే కాకుండా మేకిన్ ఇండియా విఫలం అయిందని కూడా ఆరోపించారు.