calender_icon.png 17 November, 2024 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటమ్ సాంగ్ అంటే కిస్సిక్‌మని నవ్వేస్తున్నారు!

17-11-2024 01:10:46 AM

సమంత ‘పుష్ప’ సినిమాలో ఐటం సాంగ్ చేస్తోందని తెలియగానే షాక్ అవ్వడం అభిమానుల వంతయ్యింది! స్టార్ హీరోయిన్ అయి ఉండీ మసాలా సాంగ్ ఎందుకు చేస్తోందంటూ అందరూ తలలు పట్టుకున్నారు. తాజాగా ‘పుష్ప 2’ కోసం కూడా శ్రీలీల ప్రత్యేక గీతం చేస్తోందన్న వార్త తెలిసినప్పుడు మాత్రం సినీ జనాల్లో స్పందన వేరేలా ఉంది.. అంటే, సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. ఎందుకీ తేడా? ప్రేక్షకుల ఆలోచన తీరు మారింది.

ఒకప్పుడు ఐటం సాంగ్ అనగానే కొన్ని పేర్లు మాత్రమే ప్రత్యేకంగా వినిపించేవి. కానీ, ఇప్పుడు రోజులు మారాయి.. ఆడియన్స్ టేస్టూ మారింది. ప్రేక్షకుడి నాడి పట్టుకున్న ఫిల్మ్ మేకర్స్ స్టార్ హీరోయిన్స్‌తో సైతం ఐటెం సాంగ్స్ చేయిస్తున్నారు.

ప్రేక్షకుడి అభిరుచికి అనుగుణంగా స్టార్ డమ్ ఉన్న హీరోయిన్లు సైతం ప్రత్యేక గీతాల్లో ఆడిపాడాలన్న కబురు అందగానే ‘ఊ..’ అని చెప్పేసి, అవకాశం వచ్చిన సంబరంలో ‘కిస్సిక్’ అని సన్నగా నవ్వేస్తున్నారు. నేమ్, ఫేమ్ ఉన్న హీరోయిన్లు ఫస్ట్ టైమ్ ఐటెం సాంగ్‌కు ఎంపికైన ప్రతిసారీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది. అందుకే ఈ వారం విజయక్రాంతి ప్రత్యేక కథనం కూడా ఐటం సాంగ్స్‌లో మెరిసిన భామల గురించే.. 

స్టార్ హీరోయిన్.. అయితేనేమి?

గతంలో తెలుగు నాట స్టార్ హీరోలతో సమానంగా ఆదరణ పొందిన రాశీ, రంభ, రమ్యకృష్ణ లాంటి కథానాయికలు కూడా ప్రత్యేక గీతాలు చేశారు. అయితే, వాళ్లు హీరోయిన్‌గా ఫేమ్ తగ్గిన తర్వాతే చేశారు. స్టార్ హీరోయిన్‌గా ఉన్నప్పుడే ఐటం సాంగ్స్ చేసే ట్రెండ్ మొదలుపెట్టింది మాత్రం శ్రియ శరణ్ అని చెప్పాలి.

వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఉన్నప్పుడే రామ్ పోతినేని తొలి చిత్రం ‘దేవదాసు’లో ఐటం సాంగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది శ్రియ. ఆ పాట అప్పట్లో బాగా ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత కూడా ‘మున్నా’, ‘తులసి’, ‘కొమరం పులి’ చిత్రాల్లో శ్రియ ప్రత్యేక గీతాల్లో మెరిసింది. ఫలితంగా ఇతర కథానాయికలూ ఐటం సాంగ్ వైపు అడుగులు వేశారు.

హీరోయిన్ తమన్నా కూడా స్టార్ హీరోయిన్‌గా ఉన్నప్పుడే ‘అల్లుడు శీను’, ‘కేజీఎఫ్’, ‘జై లవకుశ’ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. ఇటీవల బాలీవుడ్ చిత్రం ‘స్త్రీ2’లోనూ ‘ఆజ్ కీ రాత్’ అంటూ ఆడిపాడింది. మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ‘జనతా గ్యారేజ్’లో ప్రత్యేక గీతంతో మెప్పించింది.

హన్సిక ‘బిల్లా’లో, శృతి హాసన్ ‘ఆగడు’లో, అనుష్క ‘స్టాలిన్’లో, ఛార్మి ‘భాయ్’ సినిమాలో ఐటం సాంగ్స్‌తో రెచ్చిపోయారు. పూజా హెగ్డే కూడా ‘రంగస్థలం’లో ‘జిగేలు రాణి..’గా కుర్రకారులో వేడి పెంచింది. ‘పుష్ప’ మొదటి భాగంలో ‘ఊ అంటావా..’తో సమంతపై కూడా ఐటెం భామగా ముద్ర పడింది. తాజాగా ‘పుష్ప 2’ కోసం శ్రీలీల అదే తోవను ఎంచుకుంది.  

ఐటం వెనుక మతలబు ఇదే! 

స్టార్ హీరోయిన్లు ఐటం సాంగ్స్ చేయడానికి ముఖ్యంగా రెండు కారణాలు. ఒకటి గుర్తింపు, రెండు డబ్బు. ఐటం సాంగ్ చేస్తే బాగా పాపులర్ అయి గుర్తింపు వస్తుంది. వేరే భాషల్లో కూడా ఈ సాంగ్స్‌తో పాపులర్ అవ్వొచ్చు. అభిమానులను, సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచుకోవచ్చు. ఇక ఒక సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్‌లో దాదాపు సగానికిపైగా ఒక ఐటం సాంగ్‌కే తీసుకోవచ్చు.

అంటే, తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు అన్నమాట! ఉదాహరణకు.. ఓ స్టార్ కథానాయిక ఒక సినిమా చేయాలంటే సుమారు రూ.2 కోట్లు అయినా తీసుకుంటుంది. అయితే, 30 రోజులు డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఐటం సాంగ్ విషయంలో వారం రోజులు షూటింగ్‌కు హాజరైతే సరిపోతుంది.

ఓ సినిమాకు తీసుకునే పేమెంట్‌కు కొంచెం అటూఇటుగా భారీ మొత్తంలో పారితోషికం అందనే అందుతోంది. ఇలా స్టార్ హీరోయిన్స్ అంతా డబ్బుల కోసం, గుర్తింపు కోసం ఐటం సాంగ్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇంకా వివరణంగా చెప్పాలంటే.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా ఫేమ్ ఉన్నప్పుడే డబ్బు సంపాదింస్తున్నారు స్టార్ హీరోయిన్లు. 

గతంలో ‘స్పెషల్’ ఆర్టిస్టులు.. 

గతంలో స్పెషల్ సాంగ్స్ చేయడానికి కొంతమంది ఆర్టిస్టులు ప్రత్యేకంగా ఉండేవారు. సిల్క్ స్మిత, జయమాలిని, జయచిత్ర లాంటి ఆర్టిస్టులు నటనతోపాటు స్పెషల్‌గా ఐటెం సాంగ్స్ చేసేవాళ్లు. ఆ తర్వాత ముమైత్ ఖాన్ లాంటి వాళ్లు చేశారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎవరైనా సరే, ఐటెం సాంగ్ చేయడానికి ఓకే చెప్పేస్తున్నారు.

దీంతో హీరోయిన్లు కాస్త ఐటం భామలుగా మారిపోతున్నారు. అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. ప్రత్యేక గీతాల పద్ధతి బాలీవుడ్‌లో మొదలైంది! టాప్ ఫాంలో ఉన్నప్పుడే కరీనా కపూర్, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేశారు. దీంతో ఇది టాలీవుడ్‌కూ పాకింది.

 నరేశ్ ఆరుట్ల