వివాహమైన నాలుగు నెలలకే విధి నిర్వహణలో వీర మరణం
ఆర్మీ జవాను కెప్టెన్ అన్షుమన్ సింగ్‌కు కీర్తి చక్ర పురస్కారం
న్యూఢిల్లీ, జూలై 6 : వివాహమైన నాలుగు నెలలకే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఓ ఆర్మీ జవానుకు కీర్తి చక్ర పురస్కారం ప్రకటించింది కేంద్రం. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన భార్య అవార్డు అందుకున్నారు. విధి నిర్వహణలో విశేష శౌర్య, పరాక్రమాలు ప్రదర్శించిన ఆర్మీ, పారామిలిటరీ సిబ్బందికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం కీర్తి చక్ర, శౌర్య చక్ర పురస్కారాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మరణానంతరం కెప్టెన్ అన్షుమన్ సింగ్‌కు లభించిన కీర్తి చక్ర పురస్కారాన్ని ఆయన భార్య స్మృతి సింగ్, తల్లి అందుకున్నారు. అవార్డు స్వీకరించే సమయంలో సింగ్ సేవల గురించి చెబుతుండగా స్మృతి ఉద్వేగానికి లోనయ్యారు. చెమర్చిన కళ్లతో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “ఎనిమిదేళ్ల పాటు ఒకరినొకరం అర్థం చేసుకొని2023 ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నాం. 50 ఏళ్ల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవాలని కలలు కన్నాం. సొంతిళ్లు, పిల్లలు ఎన్నో ఊహించుకున్నాం.
కానీ, విధి నా భర్తను బలితీసుకుంది. నా భర్త ఓ హీరో. మమ్మల్ని వదిలి వెళ్లిపోయినా ఎన్నో కుటుంబాలను రక్షించాడు” అంటూ స్మృతి భావోద్వేగానికి గురయ్యారు. ఆర్మీ మెడికల్ కార్ప్స్ డాక్టర్, 26వ బెటాలియన్ పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన కెప్టెన్ అన్షుమన్ సింగ్ గతేడాది జూలై 19న విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. సియాచిన్‌లో వారు ఉంటున్న బేస్ క్యాంప్‌లో అగ్నిప్రమాదం సంభవించగా.. మంటల్లో చిక్కుకున్న జవాన్లను కెప్టెన్ ధైర్యంగా కాపాడి బయటకు తీసుకొచ్చారు. మంటను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుండగా తీవ్ర గాయాలపాలై మరణించారు. ఆయన శౌర్యానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర ప్రకటించింది.