10-03-2025 12:48:03 AM
స్వార్థ రాజకీయాల కోసం పునరావాసులను వాడుకుంటున్నారు
సమస్యల పరిష్కారం కోసం పనిచేయండి
గజ్వేల్ ను అభివృద్ధి చేసింది కేసీఆర్
గజ్వేల్‌లో విలేకరుల సమావేశంలో మాజీ ఏఎంసీ, మున్సిపల్ చైర్మన్లు
గజ్వేల్, మార్చి 9 : అధికారంలో ఉన్న విషయాన్నీ మరచి నామినేటెడ్ పదవులు, ఎన్నికల్లో టికెట్ల కోసం కాంగ్రెస్ నాయకులు కొట్టుకుంటున్నారని గజ్వేల్ ఏఎంసీ, మున్సిపల్ మాజీ చైర్మన్ లు మాదాసి శ్రీనివాస్, ఎన్సీ రాజమౌళి లు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాట్లాడితే అధికారంలో ఉండి చేసే చేతగాక కెసిఆర్ గారిని విమర్శించడం మూర్ఖత్వమని అన్నారు. 2014కి ముందు దశాబ్దాల పాటు గజ్వెల్ నియోజకవర్గం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. గజ్వెల్ ప్రజల చిరకాల వాంఛలైన రైల్వే లైన్, తాగునీరు, సాగునీరు, జిల్లా ఆసుపత్రి,ఎడ్యూకేషన్ హబ్, ఔటర్ రింగ్ రోడ్డు లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఘనత కెసిఆర్ దన్నారు. కోర్టు కేసులతో చిన్న చిన్న కారణాలతో మిగిలిపోయిన పనులను చూపించి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు విమర్శలు చేస్తున్నారని అన్నారు.
అధికారులు ఇప్పటికైనా స్పందించి నిర్వాసిత గ్రామాల ప్రజల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు. గతంలో నిర్వాసితుల వద్దకు వచ్చి రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఎందుకు మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామాల ప్రజలను మరిచిపోయారో చెప్పాలన్నారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపితే బాగుంటుంది అన్నారు. కెసిఆర్ కు ముందు, ఇప్పుడు గజ్వెల్ పరిస్థితి ఏమిటో నియోజకవర్గ ప్రజలకు తెలుసని అభివృద్ధి విషయంలో ఎక్కడైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కెసిఆర్ గతంలో మంజూరి చేసిన రూ. 170 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించాలన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండ కెసిఆర్ నాయకత్వంలో గజ్వెల్ పునర్వైభవం పొందుతుందన్నారు. ఈ సమావేశంలో గజ్వేల్ ప్రజ్ఞపూర్ టౌన్ ప్రెసిడెంట్ నవాజ్ మీరా, మాజీ కౌన్సిలర్లు బొగ్గుల చందు, కనకయ్య, శ్రీధర్, మల్లేశం, నాయకులు రమేష్ గౌడ్, ఉమర్, నిజామోద్దీన్, శివ కుమార్, హనుమంత రెడ్డి, అక్రమ్, స్వామి, తదితరులు పాల్గొన్నారు..