calender_icon.png 10 January, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ మహిళలు.. బిలియనీర్లు!

13-08-2024 12:00:00 AM

సక్సెస్ :

ఈ జనరేషన్ మహిళలు మగవాళ్లతో పోటీపడుతూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఆకాశంలో సగం.. సంపాదనంలోనూ సగం అంటూ పురుషాధిక్యాన్ని బద్ధలుగొడుతున్నారు. విద్య, వైద్యం, ఉద్యోగంతోపాటు వ్యాపార రంగంలో కూడా తమదైన ముద్ర వేస్తున్నారు. అంతేకాదు.. మగవాళ్లతో సమానంగా సంపదను సృష్టిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ బిలియనీర్లుగా పేరు తెచ్చుకున్న పదిమంది మహిళల పరిచయం ఈవారం విజయలో..

ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్

లోరియల్ ప్యారిస్.. ప్రపంచంలోనే అతిపెద్ద సౌందర్య సాధనాల కంపెనీ. ఎన్నో తరలుగా ఈ కంపెనీ తమ బ్రాండింగ్ ఉత్పత్తులతో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ సంస్థ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఈమె ఆస్తుల విలువ 98.2 బిలియన్ డాలర్లు. కాస్మొటిక్ దిగ్గజంగా పేరు తెచ్చుకున్న ఫ్రాంకోయిస్ తన నాయకత్వ లక్షణాలతో లోరియల్ కంపెనీని లాభాట బాటలో పయనించేలా చేస్తోంది. 2018లో ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 42.2 బిలియన్ డాలర్ల నికర విలువతో బెటెన్ కోర్టు మేయర్స్ మొదటిసారి కనిపించారు. అప్పటి నుండి ఆమె సంపద రెట్టింపు అవుతూ వస్తోంది. వరుసగా నాలుగుసార్లు ఫోర్బ్స్‌లో స్థానం దక్కించుకున్నారు. 

అలైస్ వాల్టన్ 

ఈమె ఎవరో కాదు... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాల్ మార్ట్ (అతిపెద్ద చిల్లర వ్యాపార సంస్థ) ఫౌండర్ సామ్ వాల్టన్ ఏకైక బిడ్డ.  అమెరికాలో అత్యంత ధనవంతురాలైన రెండో మహిళగా అలైస్ వాల్టన్ ఉన్నారు. 77.2 బిలియన్ డాలర్ల భారీ ఆస్తులున్నాయి. అయితే వాల్ మార్ట్ షేరు ధరలు ఒక్కసారిగా 34% పెరగడంతో వాల్టన్ సంపద పెరిగింది. ప్రతి ఏడాది సంపాదన పెంచుకుంటున్న పోతున్న ఈమె సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుంది. ఆర్ట్స్ పట్ల ఎంతో ఇష్టం ఉన్న అలైస్ వాల్టన్ ‘క్రిస్టల్ బ్రిడ్జెస్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ ఆర్ట్’ అనే ఆర్ట్ మ్యూజియాన్ని ప్రారంభించింది. ఇందులో దేశ విదేశాలకు చెందిన ప్రముఖల కళాకారుల రచనలు, కళాఖండాలుంటాయి. 

జూలియా కోచ్

కోచ్ ఇండస్ట్రీస్ అనేది అమెరికాలో కెమికల్ కంపెనీ. అయితే దీన్ని వ్యవస్థాపకుడు డేవిడ్ కోచ్ మరణించడంతో కంపెనీ బాధ్యతలు అందుకుంది భార్య జూలియా. ప్రస్తుతం జూలియా కోచ్ 66.3 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నారు. కోచ్ ఇండస్ట్రీస్ లో 42% వాటాను వారసత్వంగా పొందిన ఆమె చమురు శుద్ధి, వైద్యం, కాగితం ఉత్పత్తులను అందిస్తూ సమర్థవంతంగా మహిళగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కోచ్ ఇండస్ట్రీస్ 100 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయంతో ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వైద్యరంగంపై ఆసక్తితో వివిధ పరిశోధనలకుగాను భారీఎత్తున విరాళాలను కూడా ఇస్తోందీమె. 

జాక్వెలిన్ మార్స్

ప్రపంచంలో అతిపెద్ద ఫుడ్ కంపెనీ ఓనర్ మార్స్ ఇంక్ వారసురాలు ఈమె. జాక్వెలిన్ 39.4 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపచంలో నాలుగో స్థానంలో ఉన్నారు. తన నాయకత్వ లక్షణాలతో  ఐకానిక్ మిఠాయి, పెంపుడు జంతువుల ఆహార సంస్థను విజయవంతంగా రన్ చేస్తోంది. ఈ కంపెనీ ఎన్నో తరలుగా ఉత్పత్తులను అందిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ యాజమాన్య సంస్థను లీడ్ చేస్తున్న జాక్వెలిన్ కు 35 బిలియన్ డాలర్ల ఆస్తులున్నాయి. ఈ సంస్థను ఆమె తాత ఫ్రాంక్ సి మార్స్ స్థాపించారు. ఆయన మొదటిసారి 1911 లో చిన్న  వంటగదితో మిఠాయిని విక్రయించడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఇంతింతై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 

సావిత్రి జిందాల్

భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళ సావిత్రి జిందాల్ 38.0 బిలియన్ డాలర్ల సంపదతో 5 స్థానంలో ఉన్నారు. జిందాల్ గ్రూపుకు నేతృత్వం వహిస్తున్న ఆమె ఉక్కు, విద్యుత్, సిమెంట్, మౌలిక సదుపాయాల వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నారు. జిందాల్ గ్రూప్ 15 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయంతో భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థలలో ఒకటి. 2005లో ఆమె భర్త ఓం ప్రకాశ్ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత కంపెనీలను వారి నలుగురు కుమారులు పర్యవేక్షిస్తున్నారు. కానీ ఇప్పుడు వాటిని స్వతంత్రంగా నడుపుతున్నారు.

రఫేలా అపోంటే

రఫేలా అపాంటే 33.7 బిలియన్ డాలర్ల భారీ ఆస్తులున్నాయి. తన భర్త జియాన్లుగి అపాంటేతో కలిసి ప్రపంచంలోని అతిపెద్ద షిప్పింగ్ లైన్ అయిన ఎంఎస్సీని స్థాపించారు. 1970 లో ప్రారంభమైన వారి కంపెనీ 500 కి పైగా నౌకలు, 155 కి పైగా దేశాలలో కార్యకలాపాలతో ప్రపంచ షిప్పింగ్ పరిశ్రమలో ఆధిపత్యం చెలాయించేలా ఎదిగింది. అపోంటే కుటుంబం మొదటి నౌకను కొనడానికి $ 200,000 రుణం తీసుకొని షిప్పింగ్ పరిశ్రమలోకి ప్రవేశించింది. ఆ తర్వాత దినాదినాభివృద్ధి చెంది భారీ లాభాలను కొల్లగొట్టింది. 

మెకంజీ స్కాట్

అమెజాన్ ఫౌండర్ అయిన జెఫ్ బెజోస్ మాజీ భార్య. అయితే విడాకుల తరువాత ఆమె అమెజాన్ కంపెనీలో 4% వాటాను పొందడంతో భారీగా ఆస్తులు సమకూరాయి. ప్రస్తుతం మెకంజీ స్కాట్ కు 35.5 బిలియన్ డాలర్ల సంపద ఉంది.  ఈమె బిలీయనర్ మాత్రమే కాదు.. మంచి సేవాగుణం ఉన్న మహిళ. విద్య, సైన్స్, కళలు లాంటి రంగాలకు బిలియన్లను డాలర్లను విరాళంగా ఇచ్చింది. ఆ దాతృత్వం ఆమెను ప్రపంచంలోనే అత్యంత ఉదారమైన దాతలలో గుర్తింపు పొందేలా చేశాయి. 

గినా రినార్డ్

30.8 బిలియన్ డాలర్ల ఆస్తుల విలువ కలిగిన గినా రిన్హార్ట్ ఆస్ట్రేలియాలోని ప్రముఖ మైనింగ్, వ్యవసాయ సంస్థ హాన్కాక్ ప్రాస్పెక్టింగ్ గ్రూపునకు నాయకత్వం వహిస్తున్నారు. మైనింగ్ పరిశ్రమ వృద్ధి, కొత్త మార్కెట్లలోకి ఆమె కంపెనీ విస్తరణ కారణంగా 2023 నుంచి ఆమె సంపద 14% పెరిగింది. హాన్కాక్ ప్రాస్పెక్టింగ్ గ్రూప్ ఇనుప ఖనిజం, బొగ్గు, ఇతర ఖనిజాలను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు.. పశువుల పెంపకం, వ్యవసాయ ప్రాజెక్టులను పర్యవేక్షిస్తుండటంతో భారీ ఆస్తులను సంపాదించుకోగలిగారు.

అబిగైల్ జాన్సన్

29.7 బిలియన్ డాలర్ల ఆస్తులున్న అబిగైల్ జాన్సన్ ప్రముఖ మ్యూచువల్ ఫండ్ కంపెనీని లీడ్ చేస్తున్నారు. టాప్ 10 సంపన్న మహిళల జాబితాలో చోటు దక్కించుకున్న ఆమె సంస్థలో భారీ వాటాను కలిగిఉన్నారు. 4.9 ట్రిలియన్ డాలర్ల నిర్వహణ ఆస్తులను పర్యవేక్షించడమే కాకుండా సంస్థ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2022 లో తన తండ్రి ఎడ్వర్డ్ ‘నెడ్‘ జాన్సన్ III మరణించిన తర్వాత జాన్సన్ 2014 లో ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అయితే అంతకుముందు ఈ సంస్థను ఆమె తాత 1946లో స్థాపించారు.

మిరియం అడెల్సన్

లాస్ వెగాస్ క్యాసినో మాగ్నెట్ కంపెనీ ప్రస్తుత యజమాని మిరియం అడెల్సన్. 2021లో లాస్ వెగాస్ సాండ్స్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు  అయిన ఆమె భర్త షెల్డన్ అడెల్సన్ మరణించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఐదవ సంపన్న మహిళగా అడెల్సన్ నిలిచారు. ప్రస్తుతం ఆమె సంపాదన 29.7 బిలియన్ డాలర్లు. అయితే  ప్రముఖ వైద్యురాలు అయిన ఈమె వైద్య పరిశోధన, ఔషధ ఆవిష్కరణకు 1 బిలియన్ డాలర్లకు పైగా విరాళం ఇవ్వడం విశేషం. చురుకైన నిర్ణయాలు, మంచి నాయకత్వ లక్షణాలు ఈమె సొంతం.