calender_icon.png 29 December, 2024 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ మ్యూజియాలను చూడాల్సిందే!

07-12-2024 12:00:00 AM

హాయ్ ఫ్రెండ్స్.. రొటీన్‌కు భిన్నంగా ఏదైనా చేద్దామా.. పర్యాటక ప్రదేశాలు, పురాతన కట్టడాలు, చారిత్రాత్మకమైన కోటలు వీటన్నింటిని ఎప్పుడూ చూస్తు ఉంటాం కదా. కానీ ఈసారి దేశంలో మ్యూజియాలు, వాటి విశేషాల గురించి తెలుసుకుందాం.. కుదిరితే వాటిని సందర్శిద్దాం కూడా.. ఇంతకీ ఈ మ్యూజియమ్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసా..

 విజ్ఞానం.. వినూత్నం

విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలాజికల్ మ్యూజియం బెంగళూరు నడిబొడ్డున ఉంది. బస్సులు, ఇతర వాహనాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. భారతదేశంలోని పురాతన సైన్స్ మ్యూజియంగా పేరుగాంచింది. ఇది 14 జూలై 1962న స్థాపించబడింది. ఈ మ్యూజియంలో పిల్లలకు సైన్స్ పట్ల ఆసక్తిని మరింత పెంచేందుకు సహాయపడే అనేక అంశాలు అందుబాటులో ఉన్నాయి. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలను చూసి నేర్చుకోవచ్చు.

ఇక్కడ మ్యూజియంలో ఏడు ప్రదర్శనశాలలు, రెండు ప్రత్యేక ప్రదర్శన శాలలను ఏర్పాటు చేశారు. రైట్ బ్రదర్స్ నిర్మించిన కిట్టి హాక్ పూర్తిస్థాయి ప్రతిరూపం ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఇక్కడకు రావడం ద్వారా పిల్లలు అనేక ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటారు. బెంగుళూరు చరిత్ర, అభివృద్ధి గురించి తెలుసుకోవడానికి ఈ మ్యూజియం గొప్ప ప్రదేశం కూడా. 

స్పేస్‌లో విహరిద్దాం

హైదరాబాద్‌లో కూడా అద్భుతమైన మ్యూజియం ఉంది. దాని పేరు సాలార్ జంగ్ మ్యూజియం. పిల్లలు ప్లానిటోరియం, సైన్స్ మ్యూజియ్‌ను చూడొచ్చు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ సైన్స్ మ్యూజియంలలో ఒకటిగా ప్రసిద్ధిచెందింది. ఈ మ్యూజియం 2000 సంవత్సరంలో స్థాపించబడింది. ఇక్కడ స్పేస్ మ్యూజియం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మ్యూజియంలో 160 మిలియన్ల పాత డైనోసార్ శిలాజాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంది.

మాట్లాడే డైనోసార్స్

పిల్లలకు సంబంధించిన అనేక అంశాలను నేషనల్ సైన్స్ సెంటర్‌లో చూడొచ్చు. ఇది ఢిల్లీలో ఉంది. ముఖ్యంగా సైన్స్ సెంటర్ సైన్స్ పట్ల ఆసక్తి ఉన్న పిల్లలు విహరించేందుకు ఓ ఉత్తమమైన గమ్యస్థానమని చెప్పాలి. ఈ మ్యూజియంలో డైనోసార్ గ్యాలరీ, ఫన్ సైన్స్ లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ రివల్యూషన్ గ్యాలరీ, హ్యూమన్ బయాలజీ గ్యాలరీ లాంటి అనేక ఆసక్తిక అంశాలున్నాయి. ఇంకా 3డీ షోలు, మేజ్ ఆఫ్ మిర్రర్స్, మాట్లాడే డైనోసార్ బొమ్మలున్నాయి. ఇవి చూడటానికి నిజంగా ఎంతో సరదాగా ఉంటాయి. కచ్చితంగా పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.

చారిత్రక అంశాలు

ముంబైలో ఉన్న నెహ్రూ సైన్స్ మ్యూజియం కూడా పిల్లలకు మంచి ప్రదేశమనే చెప్పుకోవాలి. ఇది భారతదేశంలోని ప్రసిద్ధ మ్యూజియంలలో ఒకటిగా పేరుకెక్కింది. ఈ మ్యూజియంలో పిల్లలు అనేకరకాల విషయాల గురించి తెలుసుకోవచ్చు. 500 కంటే ఎక్కువ చారిత్రక, సైన్స్ సంబంధిత విషయాలను ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు. 3డీ, సైన్స్ షోలు ప్రతిరోజూ నిర్వహించబడతాయి. అంతేకాకుండా పిల్లలకు సైన్స్ సంబంధిత వర్క్‌షాపులను కూడా నిర్వహిస్తారు.

రైలులో రయ్ రయ్

నేషనల్ రైల్వే మ్యూజి యం న్యూఢిల్లీలో ఉంది. భారతీయ రైల్వేల చరిత్రలో ఒక చారిత్రాత్మక ప్రయాణాన్ని న్యూఢిల్లీలోని నేషనల్ రైల్వే మ్యూజియంలో చూడొచ్చు. రైల్వే నిర్మాణ చరిత్రను ప్రదర్శించే వివిధ అంశాలు, క్యారేజీలు, కోచ్‌లు ఇక్కడ ఉన్నాయి. ఈ మ్యూజియం భారతదేశ రైల్వే వారసత్వం మనోహరమైన స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. ఇక్కడ టాయ్ రైలులో ప్రయాణించవచ్చు. ఈ రైల్వే మ్యూజియం ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించడం ఖాయం.

ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బాలల మ్యూజియం. అమెరికాలోని ఇండియానాపోలిస్‌లో ఉంది. మేరీ స్టూవర్ట్ కారే అనే సంపన్న వ్యాపారవేత్త 1924లో బ్రూక్లిన్ బాలల మ్యూజియం చూశారు. దాని ప్రేరణతోనే ఆమె ఇండియానాపోలిస్‌లో స్థానిక దాతల సహకారంతో 1925లో ఈ మ్యూజియంను నెలకొల్పారు. దీనిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో 1946లో కొత్త నిర్మాణం చేపట్టి ప్రస్తుతం ఉన్న చోటికి తరలించారు.

దాదాపు 4.73 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో పిల్లల వినోద విజ్ఞానాలకు పనికొచ్చే బోలెడన్ని వస్తువులు ఉన్నాయి. వివిధ దేశాలకు చెందిన పురాతనమైన ఆటవస్తువులు ఉన్నాయి. ఈ మ్యూజియంకు ఏటా దాదాపు పదిలక్షల మందికి పైగానే సందర్శకులు వస్తుంటారు.