calender_icon.png 16 January, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ సమాధులకూ ఓ చరిత్ర

28-07-2024 04:02:50 AM

చెక్కుచెదరని 700 ఏళ్ల నాటి మట్టి సమాధులు

గవహటి, జూలై 27: అస్సాంపై బ్రిటీష్ ఆక్రమణలకు కొన్ని శతాబ్దాల పాటు అహోం రాజవంశీయులు పాలించారు. స్థానిక తెగలకు చెందిన ఈ రాజవంశం అస్సాంలో దాదాపు మధ్యయుగ కాలం నుంచి కొనసాగుతూ వచ్చింది. బ్రిటీష్ కాలం నుంచి వీరి ప్రాముఖ్యం తగ్గుతూ వచ్చింది. అయితే, ఇటీవల అహోం రాజవంశీయుల సమాధులను వారసత్వ సంపదగా గుర్తిస్తూ యూనెస్కో ప్రకటించడంతో మళ్లీ వీరి ప్రస్తావన, వారి నిర్మాణాలు చర్చలోకి వచ్చాయి. ఇవి 700 ఏళ్ల క్రితం నిర్మించిన మట్టి కట్టడాలైనా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. 

మొత్తం 90 సమాధులు..

ఈ సమాధులను మొయిదమ్‌గా స్థానిక భాషలో వ్యవహరిస్తారు. ఈశాన్య ప్రాంతంలో యూనెస్కో గుర్తింపు పొందిన అతి తక్కువ ప్రాంతాల్లో ఈ సమాధులు గుర్తింపు పొందాయి. అస్సాం ప్రాంతంలో 13 నుంచి 19వ శతాబ్దం వరకు తాయ్ అహోమ్స్ పాలించారు. వీరు తమ రాజవంశీకుల సమాధులను పూడ్చి మట్టి దిబ్బలను ఏర్పాటు చేసేవారు. చరైడియా ప్రాంతంలో  వీరికి సంబంధించి సుమారు 90 రాజ సమాధులు ఉన్నాయి. 

పవిత్ర స్థలాలుగా.. 

అస్సాంలోని మొయిదమ్‌లను అహోం రాజవంశానికి సమాధుల కోసం నిర్మించారు. వీటిని పిరమిడ్ లాంటి శ్మశాన వాటికలుగా నిర్మించారు. ఇవి అస్సాంలోని పట్కయి పర్వత  శ్రేణుల దిగువ ప్రాంతంలో ఉన్నాయి. వీటిని ఇటుక, రాయి, మట్టితో నిర్మించారు. అహోం రాజ్యానికి చెందిన రాజులు, మహారాణులను ఇక్కడే  పూడ్చి పెట్టినట్లు తెలుస్తోంది. వీరి సమాధులను ఆకర్షణీయంగా అలంకరించేవారు. వీటిని అక్కడి ప్రజలు వీటిని పవిత్ర స్థలాలుగా గుర్తించడం వల్ల ఇప్పటికీ ఇవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ సమాధులు అస్సాంలోని తాయ్ అహోం సమాజానికి ఎంతో ముఖ్యమైనవని సీఎం హిమంత వెల్లడించారు.