09-02-2025 12:00:00 AM
వయస్సు పెరుగుతున్నకొద్దీ అనేక సమస్యలు బాధిస్తుంటాయి. కంటిచూపు వినికిడి శక్తి తగ్గుతాయి. కాళ్లు, కీళ్లు పట్టేస్తుంటాయి. లేస్తే ఎక్కడ పడిపోతామో అని భయపడుతుంటారు. వీటికి తోడు మతిమరుపు ఉండనే ఉంటుంది. ఏది ఎక్కడ పెట్టారన్నది ఓ పట్టాన గుర్తుకురాదు. అయితే ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో రకాల గ్యాడ్జెట్స్ రోజువారి సమస్యలను చెక్ పెడుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
నిద్రపుచ్చుతుంది
వయసు మీదపడిన కొద్దీ చాలామంది నిద్ర సమస్య ఎదుర్కొంటుంటారు. కానీ 50 దా టాక ఏడెనిమిది గంటల నిద్ర తప్పనిసరి. అప్పుడేవాళ్లు మానసికంగానూ శారీరకంగానూ ఆరోగ్యంగా ఉండగలరు. అందుకే నిద్రలేమి సమస్యను నివారించేందుకు రూపొందించినదే ఈ స్లీప్‌సౌండ్ మెషీన్. దీని నుంచి ఒకే స్థాయిలో తేలికపాటి శబ్దాల వల్ల నరాలకు సాంత్వన కలగడంతో చక్కగా నిద్రపట్టేస్తుంది.
అందుకోసం జలపాతం, గాలి, వర్షం.. ఇలా కొన్ని రకాల శబ్దాల్ని వీటిల్లో రికార్డు చేసి ఉంచుతారు. అందులో నచ్చినదాన్ని ఆన్ చేసుకుంటే చాలు... ఆ శబ్దం మెల్లగా నిద్రలోకి వెళ్లేలా చేస్తుంది. టైమ్ సెట్ చేసి పెట్టుకుంటే దానంతటదే ఆఫ్ అయిపోతుంది. నిద్ర సమస్యతో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి
కీళ్లసమస్యలు ఉన్నవాళ్లకి వేళ్లు కూడా సరిగ్గా పట్టు ఇవ్వవు. కీళ్ల వద్ద విపరీతమైన నొప్పి వస్తుంటుంది. ఆ నొప్పిని తగ్గించేందుకు వైద్యులు వేళ్లని పట్టి ఉంచే మెటల్ రింగ్ స్లింట్స్ వేస్తుంటారు. అవి వేళ్లకి ఊతాన్నిచ్చి నొప్పిని తగ్గిస్తాయి.
వీటిని మూడువారాలపాటు పెట్టుకోవడం వల్ల ఉపశమనం ఉందనీ ఆరునెలలు వాడితే నొప్పి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అనేక రకాల గ్యాడ్జెట్స్ (ప్లాస్టిక్, క్లాత్, ఫోమ్, ఎలక్ట్రానిక్) సీనియర్ సిటిజన్స్ కోసం అందుబాటులో ఉంటున్నాయి.
పడిపోకుండా..
వయసుపైబడిన కొద్దీ పట్టు దొరక్క చాలామంది గాయాలపాలవుతుంటారు. మెట్లపై నడుస్తూనో, బెడ్‌పై నుంచి లేస్తూనో చేస్తుంటారు. కూర్చున్నప్పుడు లేవడం కష్టంగా అనిపిస్తుంటుంది. కాళ్లూ చేతులూ కూడా తిమ్మిర్లెక్కుతాయి. దానివల్ల లేచినప్పుడు నిలబడలేక పడిపోతుంటారు. ఆ సమయంలో మామూలు హ్యాండ్ స్టిక్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.
అలాగని వాళ్లకి చేయి ఇచ్చి లేపేందుకు దగ్గరలో ఎవరూ ఉండకపోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈమధ్య సెక్యూరిటీ పోల్స్‌ను తయారుచేస్తున్నారు. బాత్‌రూమ్‌లో గ్రాబ్‌బార్స్ అమర్చినట్లే బెడ్‌పక్కనా సోఫా దగ్గరా వీటి సాయంతో సులభంగా లేవగలరు. లేచాక కాసేపు నిలకడగా నిలబడేందుకూ ఇది సపోర్ట్‌గా ఉంటుంది కాబట్టి పడిపోతారన్న భయం ఉండదు.
ఎక్కడున్నా సురక్షితంగా..
చాలామంది మతిమరుపు, ఆల్జీమర్స్‌తో బాధపడటం సర్వసాధారణంగా మారింది. వాకింగ్ కోసం, ఇతర పనుల కోసం బయటకు వెళ్తుంటారు. ఒక్కోసారి దారి కూడా మరిచిపోతుంటారు. అలాంటివారి కోసం జీపీఎస్ ట్రాకర్లు బాగా ఉపయోగపడుతున్నాయి.
మినీ సైజులో ఈ గ్యాడ్జెట్స్ జేబులో పెట్టుకోవచ్చు. అలాగే బ్యాగుకి తగిలించుకోవచ్చు. కీచెయిన్‌లా వెంట తీసుకెళ్లొచ్చు. అలాగే దీనికి ఉన్న ఎస్‌ఓఎస్ బటన్ నొక్కితే అలర్ట్‌ను ఇతరులకు చేరవేస్తుంది.