13-04-2025 01:21:30 AM
ఇండోనేషియా ఎక్కడ.. తెలంగాణ ఎక్కడ.. రెండింటి మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది. అయితే సుమారు 75 వేల ఏళ్ల కింద ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో ఉన్న టోబా అనే అగ్నిపర్వతం బద్దలై వెలువడిన బూడిద వేల కిలోమీటర్ల దూరం విస్తరించింది.
అలా పడిన బూడిద నీటి ప్రవాహాలతో కొట్టుకుపోయి కొన్నిచోట్ల కుప్పగా చేరింది. అదే తరహాలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఆ అగ్నిపర్వతం బూడిద కుప్పలు మేటవేసి ఉండటాన్ని గుర్తించారు. కొత్తగూడెం సమీపంలోని ముర్రేరు వద్ద, మంజీరా లోయలోని కొన్ని ప్రాంతాల్లో సదరు బూడిద కుప్పలను జియోలజిస్టులు ఇప్పటికే గుర్తించారు. అలాగే ఏపీలోని బనగానపల్లి సమీపంలో జ్వాలాపురం గ్రామంలో మెరుగుసుద్దగా పిలుచుకునే బూడిద కుప్పలు కూడా వీటిలో భాగమేనని చెబుతున్నారు.