calender_icon.png 24 January, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాను దగ్గర చేసే దారులివే!

24-01-2025 01:18:21 AM

  1. అమెరికా వీసాలపై ప్రజల్లో పెరిగిన ఆసక్తి
  2. హెచ్1బీ, ఎఫ్-1 వీసాలతో అమెరికాయానానికి ఛాన్స్

వాషింగ్టన్, జనవరి 23: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వలసదారులకు పుట్టిన పిల్లలకు జన్మతః వచ్చే అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.

ఈ నేపథ్యంలో హెచ్1బీ వీసాపై అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. దీంతో అమెరికా లో భారతీయ విద్యార్థులకు ఉన్న వీసా అవకాశాలపై చర్చ మొదలైంది. అత్యధిక మంది భారతీయులు హెచ్1బీ వీసా, స్టూడెంట్ వీసాలపై అమెరికా వెళ్తుంటారు. 

హెచ్1బీ వీసా అంటే.. 

నైపుణ్యం గల విదేశీ ఉద్యోగులను అమెరికా కంపెనీల్లో నియమించుకోవడానికి అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిందే హెచ్1బీ వీసా పాలసీ. ఈ వీసా మీద అమెరికాకు వెళ్లిన విదేశీలు గరిష్ఠంగా 6 సంవత్సరాలు మాత్రమే అక్కడ నివసించేందుకు వీలు ఉంటుంది. 

ప్రతి సంవత్సరం అమెరికా ప్రభుత్వం 65 వేల వీసాలను మంజూరు చేస్తుంది. ఇందులో దాదాపు 20వేల వీసాలను అమెరికా విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు కేటాయిస్తుంది. ప్రస్తుతం భారతీయుల్లో అత్యధిక మంది ఈ వీసాపైనే అమెరికాలో నివసిస్తున్నారు. 

స్టూడెంట్ వీసా

విదేశీ విద్యార్థుల కోసం అమెరికా రెండు రకాల వీసాలను ఆఫర్ చేస్తుంది. అందులో ఒకటి ఎఫ్--1 వీసా కాగా మరొకటి ఎం-1 వీసా. అగ్రరాజ్యంలోని ఉన్నత విద్యాసంస్థల్లో వొకేషనల్ లేదా నాన్ అకాడమిక్ సబ్జెక్ట్‌లను చదివే విద్యార్థులకు అందించేదే ఎం1వీసా. అమెరికాలో గుర్తింపు పొందిన కళాశాలలు లేదా విశ్వవిద్యాలయాల్లో పూర్తి స్థాయి అకాడమిక్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం ఎఫ్-1 వీసాలను ఆఫర్ చేస్తుంది.

ఎఫ్-1 వీసా పొందిన విద్యార్థులు తమ గ్రాడ్యూయేషన్ పూర్తున తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో పాల్గొనవచ్చు. స్టెమ్ ఎగ్జామ్‌లో ప్రతిభ సాధించి ఆప్షనల్ ప్రాక్టికల్‌ను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులు అక్కడి కంపెనీల్లో ఉద్యోగం పొందితే హెచ్1బీ వీసాకు మారే అవకాశం లభిస్తుంది.

సుంకాల తగ్గింపునకు భారత్ మొగ్గు!

ఎన్నికల పదే పదే చెప్పినట్టుగానే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెక్సికో, కెనడా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25శాతం అధనంగా పన్నులు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. భారత్‌పైనా అధిక సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ గతంలో హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో అమెరికా విధించే అధిక సుంకాలను తప్పించుకునేందుకు ఉన్న అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో వెల్లడించింది. ఇందులో భాగంగానే అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులు తగ్గించడం, మరిన్ని వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం, అగ్రరాజ్యం నుంచి మరిన్ని ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం వంటి అంశాలు ఉన్నట్టు నివేదికలో పేర్కొంది.

యూఎస్ వీస్కీ, స్టీల్, ఆయిల్ వంటి వాటిని ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకోవడంతోపాటు అమెరికా ఉత్పత్తులైన బార్బన్, పెకాన్ నట్స్ వంటి వాటిపై పన్నులు తగ్గించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. అంతకుముందు బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో ట్రంప్ విధించే అధిక టారిఫ్‌ల నుంచి తప్పించుకోవడానికి అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న సుమారు 18వేల మంది భారతీయులను వెనక్కి రపించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపింది.

కడుపుకోతకు రెడీ

అమెరికాకు వలస వచ్చిన వారికి పుట్టే పిల్లలకు జన్మతః లభించే అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేస్తూ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లపై సంతకం చేశారు. వచ్చే నెల 20 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ఈ నేప థ్యంలో ట్రంప్ ఆదేశాలు అమల్లోకి రావడానికి ముందే పిల్లలను కనేందుకు అమెరికాలోని భారతీయ దంపతులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.

ముఖ్యంగా నెలలు నిండక ముందే 8వ, 9వ నెల గర్భిణులు సీ-సెక్షన్(శస్త్రచికిత్స) ద్వారా పిల్లలను కనడానికి తొం దరపడుతున్నారని న్యూజెర్సీలో ప్రసూ తీ ఆసుపత్రి నడుపుతున్న డాక్టర్ రమా తాజాగా మీడియాకు వెల్లడించారు. ఏడో నెల గర్భిణి అయిన ఓ భారతీయ మహిళ మందస్తు ప్రసవం కోసం ఆపరేషన్ చేయాలని తన భర్తతోపాటు సంప్రదించినట్టు పేర్కొన్నారు.

అయితే ముందస్తు ప్రసవాల వల్ల తల్లి, బిడ్డలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్టు తనను సంప్రదించే వారికి నచ్చజెబుతున్నట్టు ఆమె వెల్లడించారు. కాగా ట్రంప్ తాజా ఆదేశాల ప్రకారం ఫిబ్రవరి 20 తర్వాత వివిధ వీసాల మీద అమెరికాలో నివాసం ఉంటున్న వలసదారులకు పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదు.