ఎమ్మెల్సీ ఎన్నికలు
పులి సరోత్తంరెడ్డి, మల్క కొమరయ్య, సీ అంజిరెడ్డికి ఛాన్స్
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను బీజేపీ శుక్రవారం ప్రకటించింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు.
నల్గొండ-- వరంగల్ -ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పులి సరోత్తంరెడ్డి, కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మల్క కొమరయ్య (ఢిల్లీ పబ్లిక్ స్కూల్), కరీంనగర్--నిజామాబాద్--ఆదిలాబాద్--మెదక్ పట్టభద్ర అభ్యర్థిగా సీ అంజిరెడ్డిని ఆయన ప్రకటించారు.
పులి సరోత్తంరెడ్డి
వరంగల్ జిల్లాకు చెందిన సరోత్తంరెడ్డి 21 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా, జీహెచ్‌ఎంగా పని చేశారు. 2012-2019 మధ్య పీఆర్‌టీయూ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉపాధ్యాయుల తరఫున తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడారు.
మల్క కొమరయ్య
పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్క కొమరయ్య.. ఉస్మానియా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి బీఈ పూర్తి చేశారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ద్వారా మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేశారు. ప్రస్తుతం పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్స్ చైర్మన్‌గా ఉన్నారు.
సీ అంజిరెడ్డి
మెదక్ జిల్లా రామచంద్రాపురానికి చెందిన సీ అంజిరెడ్డి పారిశ్రామికవేత్త. చిన్నప్పటి నుంచి జాతీయవాద భావజాలం ఉన్న వ్యక్తి. ఆయన భార్య గోదావరి అంజిరెడ్డి సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు. ఎస్‌ఆర్ ట్రస్ట్ ద్వారా ఆయన రెండు దశాబ్దాలుగా గ్రామాల్లో పేదలకు మెరుగైన విద్యతో పాటు తాగునీటిని అందించే కార్యక్రమాలు చేపడుతున్నారు.