calender_icon.png 24 December, 2024 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ సవరణలు తప్పనిసరి

01-10-2024 12:00:00 AM

గణేష్ :

సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు, ఐఎఎస్, ఐపీఎస్ వంటి కీలక పదవులు నిర్వహించే వారికి ఎవరికీ లేని సౌలభ్యాలు రాజకీయ నాయకులు పొందుతుండడం దురదృష్టకరం. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ రంగంలో ఆరోగ్యకరమైన వాతావరణం కోసం కొన్ని రాజ్యాంగ సవరణలు తప్పనిసరిగా చేయవలసిన అవసరం కనిపిస్తున్నది. వాటిలో ప్రధానంగా కొన్ని ఇక్కడ ప్రస్తావనీయం. 

రెండేసి పింఛన్లు ఎందుకు?

ఒక రాజకీయ నాయకుడు ఒక్క పెన్షన్ మాత్రమే పొందేలా ఏర్పాట్లు ఉండాలి. ఎంఎల్‌ఏ, ఎంపీ, ఎంఎల్‌సీ..  ఇలా ఏవేని రెండు పదవులలో పని చేసిన కొందరు నాయకులు రెండేసి పింఛన్లు పొందడం భావ్యం కాదు. వీరికి ఒక్క పెన్షన్ సరిపోతుంది. నిజానికి చాలామంది రాజకీయ నాయకులకి పెన్షన్ అవసరం లేదనే చెప్పాలి.

కానీ, గుమ్మడి నరసయ్య వంటి పేద, నిజాయితీ నాయకులకు పింఛను వుండాలి. ‘వందమంది దోషులు తప్పించుకొన్నా ఫర్లేదు కానీ, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదన్నది’ మన న్యాయ్యవస్థ సూత్రం కదా. కాబట్టి, ఎవరు ఎన్ని పదవులు, ఎన్ని పర్యాయాలు నిర్వహించినా, ఒక వ్యక్తికి ఒక్క పెన్షన్ మాత్రమే ఇవ్వడమే సరైంది.

రెండుచోట్ల పోటీ చేయడమేమిటి?

ఎవరైనా అభ్యర్థి ఒక ఎన్నికలో ఒక నియోజక వర్గం నుండి మాత్రమే పోటీ చేసేలా రాజ్యాంగ సవరణ చేయాలి. ప్రస్తుత రాజ్యాంగ వెసులుబాటు ప్రకారం ఒక అభ్యర్థి ఏకకాలంలో రెండు (బహుళ) నియోజక వర్గాలలోనూ పోటీ చేయవచ్చు. కానీ, అతను రెండుచోట్ల గెలిస్తే ఏదో ఒకచోట (లేదా మిగిలిన చోట్ల) మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది కనుక, ఎంతో కొంత ప్రజాధనం వృధా అవుతున్నది.

ఇంతేకాదు, ఎవరైనా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి అతను కచ్చితంగా ఏదో ఒక చట్టసభలో సభ్యుడై వుండాలన్న నియమం కూడా సవరణల్లో ప్రవేశపెట్టాలి. ప్రస్తుత రాజ్యాంగం నియమాల ప్రకారం ఒక వ్వక్తి తను ఏ చట్టసభలోనూ సభ్యుడు కాకున్నా, కనీసం 6 నెలల వరకు మంత్రిగా వ్యవహరించవచ్చు.

అదే ఒక నిరుద్యోగి ఒక్క రోజు ఏ ఉద్యోగం చేయాలన్నా తత్సంబంధ అర్హతా పరీక్షలు రాసి నెగ్గాలి కదా? రాజకీయ నాయకులు ఇలా నేరుగా మంత్రి అయిపోయే విధానం తక్షణం మారాలి. 

పదవికి రాజీనామా చేయకుండా..

ఒక పదవిలో అప్పటికే కొనసాగుతున్న నాయకుడు మరో పదవికి పోటీ చేయకుండా నిబంధన విధించాలి. ఉదా॥కు ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎంఎల్‌ఏ పదవిలో ఉన్న నాయకుడు ఎంపీగా పోటీ చేయాలనుకొంటే తన పదవికి రాజీనామా చేయనవసరం లేదు.

అదే ఒక ప్రభుత్వోద్యోగి రాజకీయాలలోకి రావాలనుకొంటే మాత్రం కచ్చితంగా తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆయన ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఏదో ఒక పదవిని వదులుకోక తప్పదు. అప్పుడు మళ్ళీ ఎన్నిక నిర్వహించాలి. ప్రజాధనం వృథానే కదా? దీనిని సవరించినట్లయితే, పోటీ చేయడానికి కొత్త వారికి అవకాశం వస్తుంది. 

పార్టీ మారడానికి ముందు..

ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి మారే ముందు విధిగా సదరు ప్రజాప్రతినిధి తన పదవికి రాజీనామా చేసి వెళ్లే నిబంధన కూడా రాజ్యాంగ సవరణలో పొందు పరచాలి. పార్టీ ఫిరాయింపు చట్టం (1985) ప్రకారం స్పీకర్‌కు ఉన్న విచక్షణ అధికారాన్ని (సమయం) రద్దు చేయడమే మంచిది.

ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరొక్క పార్టీలోకి వెళ్తున్నారంటే ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఏం విలువ ఇచ్చినట్లు? రాజ్యాంగంలో ఉన్న ‘ప్రజల చేత’ అనే మాటకి కచ్చితంగా విలువ ఉండాలంటే, ఈ మేరకు సవరణలు తేవాలి.  

చాలా పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పైన పేర్కొన్న విషయాలన్నింటిలోనూ ఇన్నేళ్లుగా లబ్ధి పొందుతూనే ఉన్నారు. గతాన్ని మరచి అన్ని పార్టీలు ఈ రాజ్యాంగ సంస్కరణల కోసం  ముందుకు రావాల్సి ఉంది. ఇందుకు ఆయా పార్టీలు సహకరించాలి. 

 సెల్: 8282824233