calender_icon.png 11 January, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉష్ణ రసాయన కాసారం!

30-12-2024 02:57:34 AM

* అత్తాపూర్ బాపూఘాట్ వంతెన వద్ద పాశమైలారంలోని ఓ పరిశ్రమకు చెందిన కెమికల్ వ్యర్థాలను మూసీలో కలుపుతున్న ట్యాంకర్లను ఇటీవల స్థానికులు పట్టుకున్నారు. ఇలాంటి వాటిని నిరోధించాలంటే పరిశ్రమలన్నీ తమ వ్యర్థాలను ఎక్కడిక్కడ పూర్తిస్థాయిలో శుద్ధి చేసుకుని, తిరిగి వినియోగించే విధానాన్ని అమలు చేయాలి.

వాతావరణంలోకి కాలుష్య కారకాలను విడుదల చేయడంలో పరిశ్ర మలు మొదటి స్థానంలో ఉంటాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాల కారణంగా గాలి, నీరు, భూమి తీవ్రంగా కలుషితమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మూసీ నది పునరుజ్జీవం చేసేందుకు కంకణం కట్టుకోవడం ముదావహం. ఈ నేపథ్యంలో కాలుష్య నివారణపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.1.50 లక్షల కోట్లతో మూసీ నదిని పునరుజ్జీవం చేయడంతోపాటు పరీవాహక ప్రాంతంలో అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించింది. అయితే మూసీని పునరుజ్జీవం చేయాలంటే ముందుగా దానిని శుద్ధి చేయాలి. నదిలో నిరంతరాయంగా వ్యర్థాలు, రసాయనాలు కలుస్తున్నందున ఇది  కొ ంచెం కష్టంతో కూడిన పని. పరిశ్రమల నుంచి వచ్చి మూసీలో కలిసే రసాయనాలను ఆపితేనే పునరుజ్జీవం సాధ్యమవుతుంది.

మురికి నదుల్లో నాలుగో స్థానంలో..

మన దేశంలోని అత్యంత మురికి నదుల్లో మూసీ నాలుగో స్థానంలో ఉంది. హైదరాబాద్ నగర మురికి నీరు మొత్తం ఈ నదిలో కలుస్తున్న విషయం తెలిసిందే. నది పరీవాహక ప్రాంతంలో సాగవుతున్న వ్యవసాయానికి కూడా కలుషిత నీటిని వినియోగించడంతో ఆయా పంటల్లో ప్రమాదకర రసాయనాలు, వ్యర్థ పదార్థాల మోతాదు పెరుగుతున్నది.

వీటిని ఆహారంగా తీసుకున్న ప్రజలు, అనేక రోగాలు, రుగ్మతల బారిన పడుతున్నారు. క్యాన్సర్, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల విస్తృతి పెరుగుతున్నది. అయితే నిర్మాణాల వేగం నేపథ్యంలో మౌలిక సదుపాయాల ఏర్పాటు సమాంతరంగా ఏర్పాటు కావడం లేదు. మురికి నీరు, మంచి నీరు, రోడ్లు, చెత్త నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పడటం లేదు.

పరివాహకంలో పరిశ్రమలు హాట్ స్పాట్లు..

మూసీ నది పరివాహకంలో 520 పరిశ్రమలు నెలకొని ఉన్నాయి. వాటిలో 194 పరిశ్రమల నుంచి 5.65 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు వస్తుండగా, వాటిని శుద్ధి చేసి అక్కడే పునర్వినియోగించుకుంటున్నట్టు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీజీపీసీబీ) తెలియజేస్తున్నది.

మిగిలిన 326 పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు కామన్ ఎఫ్లూయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు వెళ్తున్నాయని, అక్కడ శుద్ధి చేసిన తర్వాత ప్రతిరోజు 4 మిలియన్ లీటర్ల జలాలు అంబర్‌పేట వద్ద నదిలో కలుస్తాయని పేర్కొంటున్నది. అయితే అక్కడ నిర్దేశిత ప్రమాణాల మేరకు శుద్ధి జరిగితే మూసీ ఇంతలా మురికి కూపంగా మారదు.

అంబర్‌పేట తర్వాత ఉప్పల్, మల్లాపూర్, నాచారం పారిశ్రామిక వాడల నుంచి వచ్చే జలాలు, ఉప్పల్ నల్లచెరువు కింద కలిసే వ్యర్థాలతో మూసీ తీవ్ర కాలుష్యం బారిన పడుతోంది. దిగువన ఘట్‌కేసర్, హయత్ నగర్, బీబీ నగర్, భూదాన్ పోచంపల్లి మండలాల్లోని పరిశ్రమలు సైతం మూసీని కలుషితం చేస్తున్నాయి.

అయితే పటాన్‌చెరు ప్రాంతంలోని నక్కవాగు నుంచి కూడా పారిశ్రామిక జలాలు మూసీలోకి వస్తున్నాయి. పీసీబీ వివరాల ప్రకారం మూసీ నదికి మొత్తం 12 హాట్ స్పాట్లు ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో రెండు, మేడ్చల్‌లో ఒకటి, రంగారెడ్డిలో రెండు, యాదాద్రిలో మూడు, సూర్యాపేటలో రెండు, నల్గొండలో రెండు చొప్పున ఉన్నాయి. హైదరాబాద్‌తోపాటు వెలుపల ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల కారణంగా ఉప నది కాలుష్యం బారిన పడుతోంది. 

మూసీలోకి ప్రమాదకర రసాయనాలు

నగరంలో దాదాపు వంద ఏండ్ల కింద కట్టిన నాలాల వ్యవస్థనే ఇప్పటికీ వాడుతున్నాం. నగరంలో పారే మురుగు నీటిలో కేవలం ఇంటి నుంచి వచ్చే నీళ్లే కాక, పరిశ్రమల నుంచి, వాణిజ్య కార్యకలాపాల వల్ల కూడా కలుషిత జలాలు మూసీ నదిలో కలుస్తున్నాయి. ఈ మురుగు నీటిలో అనేక ప్రమాదకర రసాయనాలు కలసి పైపుల ద్వారా మూసీ నదిలో లేక సమీప వరద కాల్వలో, చెరువల్లోకి చేరుతున్నాయి.

మురుగు నీరు శుద్ధి చేయకుండా ఈ విధంగా వదలడం వల్ల అనేక ప్రాంతా ల్లో భూగర్భ జలాలు, ఉపరితల నీటి వనరులు కలుషితం అవుతున్నాయి. కలుషిత నీరు తాగడం వల,్ల వాటి ద్వారా పండించిన గడ్డి తిన్న పశువుల పాలు కూడా కలుషితమవుతున్నాయి. మూసీ నది మురికి నీటి ప్రవాహంగా మారడానికి గతంలోని నిర్లక్ష్యమూ కారణమే.

ఈ పరిస్థితి సరిచేయాలంటే మురికి వ్యవస్థ ఏర్పాటు చేయడంతోపాటు, మురికి నీటి శుద్ధి కేంద్రాలు పెరగాలి. మూసీ నది ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మొదట మూసీలోకి పరిశ్రమల వ్యర్థ జలాలు రాకుండా చూడాలి. రసాయనాలు మూసీ నీటిలో కలువకుండా చర్యలు తీసుకోవాలి. అప్పుడు గానీ మూసీ పునరుజ్జీవం సాధ్యం కాదు. 

కలుషితం కాకుండా ఆపాలి..

రెండు దశాబ్దాలుగా నగరాలు, పట్టణాలు కూడా వ్యర్థ జలాల ఉత్పిత్త కేంద్రాలుగా మారుతున్నాయి. నగరాల భౌగోళిక విస్తరణకు సమాంతరంగా వ్యర్థ జలాల విస్తృతి, పరిమాణం కూడా పెరుగుతున్నది. పరిశ్రమలు ఎక్కువగా నగరాల్లో, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు అవుతుంటాయి. దీంతో పారిశ్రామిక వ్యర్థ జలాలు కూడా నగర నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాల నుంచి వచ్చే మురికి నీటిలో కలుస్తున్నాయి.

ప్రమాదకర పారిశ్రామిక వ్యర్థ జలాలను కొన్ని చోట్ల శుద్ధి కేంద్రాల నుంచి నేరుగా మూసీ నదిలోకి వదులుతున్నారు. నగరాల్లో ఇళ్ల నుంచి వచ్చే సగటు మురికి నీరు సాధారణ గ్రామీణ గృహం కంటే ఎక్కువగా ఉంటుంది. అపార్ట్‌మెంట్ల నుంచి వచ్చే మురికి నీటి పరిమాణం ఇంకా ఎక్కువగా ఉంటుంది.

హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో వ్యర్థ జలాలు పెరుగుతున్నాయి. అవి నేరుగా వెళ్లి మూసీ నదిలో కలుస్తున్నాయి. దీంతో పర్యావరణం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. మూసీని శుద్ధి చేసేందుకు కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముందుగా దానిని కలుషితం కాకుండా నిరోధించాలి. అప్పుడే మూసీ నదికి సులువుగా, వేగంగా పునరుజ్జీవం కల్పించే అవకాశం ఉంటుంది. 

ప్రమాద కారకాలు, ప్రభావం..

* నీటిలో సాధారణంగా మురుగు, మడ్డి 1 నుంచి 4 పాయింట్ల వరకు ఉండాలి. పీర్జాదిగూడ, ప్రతాపసింగారం, పిల్లాయిపల్లి వంటి చోట్ల పరిమితికి మించి ఉంది. అధిక మురుగు, మడ్డి కారణంగా నీటిలో స్వచ్ఛత లోపిస్తుంది. ఈ జలాలు సూర్యకాంతిని నీటిలోకి రానివ్వవు. దీంతో నీటిలోపల కాంతి అందక మొక్కలు, ఆక్సిజన్ తగ్గి చేపలు చనిపోతాయి. 

* నీటిలో టోటల్ కొలిఫాం బ్యాక్టీరియా అసలే ఉండకూడదు. కానీ నగరంలో ఏడు చోట్ల 350 నుంచి 430 వరకు, ఐదుచోట్ల 31 వర కు ఉండటం గమనార్హం. ఈ నీటిని పొరపాటున తాగితే వెంటనే డయేరియా, జ్వరం బారిన పడతారు. 

* లీటర్ నీటిలో కనీసం 4 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగానే కరిగిన ఆక్సిజన్ ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే నీటిలోని జీవులు జీవించలేవు. పీసీబీ నిర్వహించిన పరీక్షల్లో ఏడు చోట్ల కరిగిన ఆక్సిజన్ చాలా తక్కువగా ఉన్నట్టు తేలింది. 

* బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ లీటర్ నీళ్లలో 3 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండాలి. లేదంటే ఆ నీళ్లు వాడుకోవడానికి కూడా పనికిరాదు. సోలిపేట వద్ద మాత్రమే 3 మిల్లీ గ్రాముల బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఉంది. 

పలు కాలుష్య ఘటనలు..

* జీడిమెట్ల, నాచారం పారిశ్రామిక ప్రాంతాల్లోకి డ్రైనేజీలన్నీ రసాయన వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ఈ డ్రైనేజీల్లోని జలాలన్నీ స్థానిక చెరువుల్లోకి, ఆ తర్వాత మూసీలోకి వెళ్తున్నాయి. మూసీలోకి నేరుగా రసాయన వ్యర్ధాలు వెళ్లేందుకు ఏకంగా పైపుల వ్యవస్థ ఉన్నట్లు అనేక దృష్టాంతాలు వెలుగు చూశా యి.   జీడిమెట్ల సమీపంలోని సుభాష్‌నగర్ డివిజన్ వెంకటాద్రినగర్‌లో ఇటీవల మ్యాన్‌హోల్ నుంచి ఎరుపురంగు నీరు వచ్చి రోడ్లపై పారడం తో స్థానికులు ఇబ్బంది పడ్డారు. 

* అత్తాపూర్ బాపూఘాట్ వంతెన వద్ద పాశమైలారంలోని ఓ పరిశ్రమకు చెందిన కెమికల్ వ్యర్థాలను మూసీలో కలుపుతున్న ట్యాంకర్లను ఇటీవల స్థానికులు పట్టుకున్నారు. ఇలాంటి వాటిని నిరోధించాలంటే పరిశ్రమలన్నీ తమ వ్యర్థాలను ఎక్కడిక్కడ పూర్తిస్థాయిలో శుద్ధి చేసుకుని, తిరిగి వినియోగించే విధానాన్ని అమలు చేయాలి. 

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి