calender_icon.png 8 January, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రెస్సింగ్ రూమ్‌లో కలకలం!

02-01-2025 12:00:00 AM

  1. ఆటగాళ్లపై కోచ్ గంభీర్ ఆగ్రహం 
  2. పంత్‌పై వేటు పడే అవకాశం

సిడ్నీ: బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-2తో వెనుకబడింది. మెల్‌బోర్న్ టెస్టులో ఘోర వైఫల్యం తర్వాత భారత డ్రెస్సింగ్‌రూమ్‌లో ఆటగాళ్లపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

సీనియర్ ఆటగాళ్లు విఫలమవ్వడంపై, పంత్ నిర్లక్ష్యంగా ఆడి వికెట్ సమర్పించుకోవడంపై గంభీర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కోచ్‌గా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు కావొస్తున్నప్పటికీ ఇప్పటివరకు గంభీర్ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడ ని.. ఇకపై అది కుదిరే అవకాశం లేదు. ఇన్నాళ్లు మ్యాచ్‌కు అనుగుణంగా గంభీర్ తీసుకుంటున్న వ్యూహాలకు..

మైదానంలో ప్లేయర్ల ఆటతీరుకు పొంతన ఉండడం లేదన్న అంశం చర్చకు వచ్చింది. మెల్‌బోర్న్ టెస్టులో బాధ్యతగా ఆడాల్సిన తరుణంలో పంత్ నిర్లక్ష్యంగా వికెట్ సమర్పించుకోవడం గంభీర్‌కు కోపం తెప్పించింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో పంత్‌కు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. టీమిండియా మ్యాచ్ కోల్పోవడానికి పంత్ వికెట్ కారణమైంది. 

సిడ్నీ వేదికగా జరగనున్న చివరి టెస్టుకు పంత్‌పై వేటు పడే అవకాశముంది. అతడి స్థానంలో ధ్రువ్ జురేల్‌ను ఆడించనున్నారు. సీనియర్లయిన కోహ్లీ, రోహిత్‌ల పేలవ ఆటతీరు గంభీర్‌ను బాధించిందని పలువురు పేర్కొన్నారు. ఇకపై దీనిని ఉపేక్షించేది లేదని త్వరలో తీవ్రమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ద్రవిడ్ అనంతరం కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న గంభీర్‌కు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. లంకతో వన్డే సిరీస్ ఓటమి, స్వదేశంలో కివీస్‌తో టెస్టు సిరీస్ వైట్‌వాష్, తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కోచ్‌గా గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి.