24-04-2025 08:45:31 PM
భూభారతి చట్టంతో ఇక భూముల సమస్యలు ఉండవు..
ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్ర శ్రేణిగా నిలుస్తోందని, భూభారతి నూతన చట్టంతో ఇక భూముల సమస్యలు ఉండవని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్(MLA Dr Jatoth Ramachandru Naik) తెలిపారు. గురువారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్ల చర్ల లో భూభారతి చట్టం అమలు తీరుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, యువత స్వయం సమృద్ధి సాధించేందుకు రాజీవ్ యువ వికాసం, సన్నవడ్లకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్, నిరుపేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.
గత ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా రైతులకు ఎన్నో చిక్కులు తెచ్చిపెట్టిందని, ఆ విధానాన్ని పూర్తిగా తొలగించి పారదర్శకంగా భూములను హక్కుదారులకు చిందే విధంగా భూభారతి చట్టంలో అనేక అంశాలను పొందుపరచడం జరిగిందన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం స్థానికంగానే అధికారులు చర్యలు తీసుకుంటారని, రైతులు ఎక్కడికి తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ... భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి న్యాయ సేవలు అందుతాయన్నారు. ఎక్కడికక్కడే సమస్యల పరిష్కారం కోసం అధికారులకు అధికారాలు కల్పించడం వల్ల సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కే.వీరబ్రహ్మచారి, ఆర్డీవో కృష్ణవేణి, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహమూర్తి, తహసిల్దార్ కృష్ణవేణి, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.