calender_icon.png 24 October, 2024 | 10:01 AM

భాషా ప్రాతిపదికన ఎలాంటి వివక్ష ఉండబోదు

15-09-2024 02:31:02 AM

  1. హిందీ పాత్రికేయులకూ అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు ఇస్తాం 
  2. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి

ముషీరాబాద్, సెస్టెంబర్ 14 : అర్హులైన హిందీ పాత్రికేయులకు ప్రాతినిథ్యం కల్పిస్తామని, భాషా ప్రాతిపదికన వివక్ష ఉండబోదని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ హిందీ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లడుతూ.. తెలంగాణలో కొత్తతరం పిల్లలు అందరూ హిందీ మాట్లాడుతారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాత్రికేయులను భాషా ప్రాతిపదికన చూడదని స్పష్టం చేశారు.

పాత్రికేయులకు ఇండ్ల స్థలాల కేటాయింపుతో పాటు అక్రిడిటేషన్ల మంజూరు, మెడికల్ ఇన్సూరెన్స్ లాంటి అన్ని పథకాలు అర్హులైన హిందీ జర్నలిస్టులందరికీ అందేట్లు చూసే బాధ్యత తనదే అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఇటీవలే జవహర్‌లాల్ నెహ్రూ హౌజింగ్ సొసైటీకి ఇండ్లస్థలాలు అందజేశామని.. త్వరలో మరో 3వేల మందికి పైగా హైదరాబాద్ జర్నలిస్టులకు కూడా ఫ్యూచర్ సిటీలో ఇండ్ల స్థలాలు ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని అన్నారు.

అయితే దానికి కావాల్సిన నియమ, నిబంధలను తదితర మార్గదర్శకాలు రూపకల్పన దశలో ఉన్నాయని అన్నారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ భాషా భేదం లేకుండా నివాస స్థలాలు లభిస్థాయని శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, దక్షిణ్ సమాచార్ ఎడిటర్ నీరజ్ కుమార్, పలువరు జర్నలిస్టులు పాల్గొన్నారు.