30-04-2025 12:30:22 AM
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవినీతి జరగలే దని, ప్రాజెక్టులో అవినీతి జరిగినట్టు ఎన్డీఎస్‌ఏ తన నివేదికలో ఎక్కడా చెప్పలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్డీఎస్‌ఏ నివేదికపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే అన్నా రు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన ప్రయాస, అపసోపాలు చూస్తే జాలి కలిగిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్‌ఏ ఇచ్చిన నివేదికపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం అయినందున దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు.
మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడోబ్లాకును రిపేర్ చేయవచ్చని ఎన్డీఎస్‌ఏ చెప్పిందన్నారు. అందువల్ల వెంటనే మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు.
అప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు ఇలా..
గతంలో ఎన్డీఎస్‌ఏ బిల్లును లోక్‌సభలో ఉత్తమ్ వ్యతిరేకించారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇప్పుడేమో అది గొప్పదని మాట్లాడుతున్నారని ఇలా మాట్లాడటం ఆయనకే చెల్లుతుందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రంవాల్, గైడ్‌వాల్ కుప్పకూలి నాలుగైదేళ్లు గడిచినా ఎన్డీఎస్‌ఏ ఎందుకు అక్కడ సందర్శించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయ ని హరీశ్‌రావు ఆరోపించారు.
తుమ్మిడిహట్టి కోసం అనుమతులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తీసుకురాలేదని, మహారాష్ట్రతో ఎందుకు ఒప్పందం చేసుకోలేదని ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించిందుకు తమ ప్రభుత్వం మహారాష్ట్రతో చర్చలు జరిపితే, అక్కడ నీళ్లు లేవని సీడబ్ల్యూసీ చెప్పిందన్నారు.
అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ సూచన మేరకే మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించినట్టు వెల్లడించారు. ప్రాజెక్టును అక్కడ నిర్మించడం వల్ల ప్రాజెక్టు సామర్థ్యం 16 టీఎంసీల నుం చి 140 టీఎంసీలకు పెరిగిందన్నారు. ఆయకట్టు, నీటి నిల్వ సామర్థ్యం పెరిగినందునే వ్యయం కూడా పెరిగిందని పేర్కొన్నారు.
ఆ ప్రాజెక్టులకు డీపీఆర్‌లు ఉన్నాయా?
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కొడంగల్, నారాయణపేట ప్రాజెక్టులకు డీపీఆర్‌లు ఉన్నాయా? అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆ ప్రాజె క్టులకు డీపీఆర్, అనుమతులు లేకున్నా టెం డర్లు పిలిచారని ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో మీకో నీతి మాకో నీతా? అని ప్రశ్నించారు. తాము తప్పు చేస్తే కేంద్ర సంస్థలు ఎందుకు అప్పు ఇచ్చేవని ప్రశ్నించారు.
నందికొండ నుంచి నాగార్జున సాగర్ పాజెక్టు చోటు మారిందన్నారు. అలాగే కుస్తాపురంలో నిర్మించాల్సిన ఎస్సారెస్పీ ప్రాజెక్టు పోచంపాడుకు మారిన విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుర్తు తెచ్చుకోవాలన్నారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ ్డ మాత్రమే కాదని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు కింద మూడు బ్యారేజ్‌లు, 19 సభ్ స్టేషన్లు, 21 పంపు హౌజ్‌లు, 16 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టన్నెల్, 231 కిలోమీటర్ల గ్రావిటీకెనాల్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్‌లు ఉన్నాయన్నారు. ఐదుగురు సభ్యుల కమిటీ మేడిగడ్డ వద్ద నుంచి నేరుగా మిడ్ మానేరుకు నీటి తరలించడం సాధ్యం కాదని చెప్పడం వల్ల అన్నారం, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చామన్నారు.
వర్షాకాలంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే కేవలం 53 లక్షల మెట్రిక్ టన్నులే ఎందుకు కొన్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు తప్ప మిగితా ప్రాజెక్టు అంతా బాగుందని, దాన్ని త్వరగా రిపేర్ చేయాలని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాం డ్ చేశారు. కాళేశ్వరానికి 90వేల కోట్లే ఖర్చు అయిందని, మంత్రి ఉత్తమ్ మాత్రం రూ. లక్షకోట్లు ఖర్చు చేశారంటూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.