బూర్గంపాడు (విజయక్రాంతి): పథకాలకు లబ్ధిదారుల ఎంపిక పేరిట కాంగ్రెస్ సర్కారు నిర్వహిస్తున్న గ్రామసభలు రచ్చ రచ్చగా మారాయి. పథకాల ఎగవేతపై జనం అధికారులను నిలదీస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన పేదలకు చోటు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌కార్డులు, ఆత్మీయ భరోసా పథకాల్లో చోటు దక్కకపోవడంపై గుండెమండిన సామాన్యులు తిరగబడుతున్నారు. అనర్హులను జాబితాలో చేర్చడంపై ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. నాలుగో రోజైన శుక్రవారం కూడా గ్రామసభలు నిలదీతలు, నిరసనలు మధ్య సాగాయి. బూర్గంపాడు మండలంలోని సారపాక, నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామసభల్లో వాగ్వాదాలు, నిరసన దృశ్యాలు కనిపించాయి.