భూ తగాదాలు, చేతబడి నెపంతో కత్తితో పొడిచి తమ్ముడిపై దాడి చేసిన అన్న
తీవ్ర రక్తస్రావం ఆసుపత్రికి తరలింపు...
అచ్చంపేట: భూ తగాదాల నేపథ్యంలో తమ్ముడిపై అన్న కత్తితో పొడిచి హతమార్చేందుకు యత్నించాడు. ఈ ఘటనలో రక్తపు మడుగులో ఉన్న తమ్ముడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని బొమ్మనపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... బొమ్మనపల్లి గ్రామానికి చెందిన అర్జున్, వేణు ఇద్దరూ అన్నదమ్ముల మధ్య భూ పంచాయతీ నెలకొంది. సోమవారం ఉదయం తన ఇంట్లో నిద్రిస్తున్న తమ్ముడు అర్జున్ పై అన్న వేణు కత్తితో దాడికి దిగాడు. మేల్కొని ప్రతిఘటించేలోపే మరో నాలుగు చోట్ల కత్తిపోట్లు బలంగా పొడవడంతో రక్తపుమడుగులో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. దీన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం అన్న వేణు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం అర్జున్ మీడియాతో మాట్లాడుతూ.. తన అన్న వేణు తనని చంపేందుకు ప్రయత్నించాడని ఆరోపించాడు. ఇద్దరి మధ్య భూతగాదాలతో పాటు చేతబడి చేశాడనే అనుమానంతో తన అన్న దాడి చేశాడని అర్జున్ తెలిపాడు.