ఔనూ! ఇక్కడో చెట్టుండేది
ఎవరు పీకేశారు?
అక్కడో చింతల తోపుండేది
ఎవరు నరికేశారు?
ఇదిగో ఇక్కడో చెరువుండేది
ఎవరెత్తుకెళ్లారు?
అక్కడో నది ఉండేది
ఎవరు పట్టుకెళ్లారు?
అరెరే..
గుడిసెలూ గూడాలూ
పొలాలూ పుట్రలూ
కొండలూ గుట్టలూ
తుమ్మలూ తూములూ
తోటలూ బాటలూ
ఏ కొండ చిలువలు
మింగేశాయి??
ఆ అవ్వ ఏమైపోయింది.
ఆ పల్లె ఎటు వలస వెళ్లింది
బావులన్నీ ఎక్కడున్నాయ్
చెలిమలన్నీ ఎందుకలిగాయ్?
పశువులెక్కడ?
పక్షులెక్కడ?
మనుషులేరీ?
మమతలేవీ?
అన్నట్లూ...
ఇక్కడో నాగరికత ఉండేది.
ఎవరు తుడిచేశారు?
విశిష్టమైన సంస్కృతి ఉండేది
ఎవరు విషం కలిపారు?
విలక్షణమైన జీవన
విధానముండేది
ఎందుకిలా మారిపోయింది?
మిత్రులారా! కళ్లు తెరవండి
‘ఇక్కడో దేశముండేది’
అని ప్రశ్నించే
పరిస్థితిని తేకండి-
(హైడ్రా కూల్చివేతల
నేపథ్యంలో...)
డా. ఎస్వీ సత్యనారాయణ