calender_icon.png 4 March, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి కొరత లేకుండా చూడాలి

03-03-2025 12:03:06 AM

నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ / మునుగోడు, మార్చి 2 (విజయక్రాంతి) : వేసవిలో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. చండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరాపై ఆదివారం అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జనాభా ఆధారంగా తాగునీటి సరఫరాకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

మిషన్ భగీరథ నీటి వనరులు, బోర్లు, పైపులైన్లకు మరమ్మతులుంటే వెంటనే చేపట్టాలని చెప్పారు. మిషన్ భగీరథ నీరు తాగేందుకు మాత్రమే వినియోగించేలా చూడాలని సూచించారు. ఇతర అవసరాలకు వాడొద్దని  ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. తాగునీటి సరఫరాలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పట్టణంలోని 7, 9వ వార్డుల్లో నిర్మిస్తున్న నీటి ట్యాంకులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అనుముల (హాలియా) మండలం పాలెం సమీపంలోని వజ్రతేజ ఇండస్ట్రీని కలెక్టర్ సందర్శించి బియ్యం నాణ్యతను పరిశీలించారు. అంతకుముందు శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కలెక్టర్ నివాళులర్పించారు.