04-04-2025 12:56:18 AM
జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
కొండపాక, ఏప్రిల్ 3 :యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని, సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రల నిర్వాహకులకు, ఐకెపి ఏపీఎం, మండల వ్యవసాయ, వ్యవసాయ విస్తరణ అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందేలా చూడాలని ఆదేశించారు.
జిల్లాలో సుమారు 3.50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు అయిందని, 4లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 30 వేల మెట్రిక్ టన్నుల సన్నరకం దాన్యం సాగైందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 419 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్యాడి క్లీనర్లు, వేయింగ్ స్కేలు, మ్యాచర్ మీటర్, ట్రైన్ డ్రయ్యేర్స్, తార్ఫలిన్ కవర్లు ఖచ్చితంగా అందుబాటులో ఉండే విధంగా నిర్వాహకులు చూసుకోవాలని చెప్పారు.
గ్రేడ్-ఏ, రూ. 2320, సన్న రకం దాన్యం ప్రభుత్వం మద్దతు ధర కంటే క్వింటాల్ కు రూ. 500 అదనంగా చెల్లిస్తుందన్నారు. దాన్యం కొనుగోలు కేంద్రాలకు అవసరమైన గన్ని బ్యాగులను సమకూర్చాలని జిల్లా పౌరసరపర మేనేజర్ ను ఆదేశించారు. ఏప్రిల్ 7 లోపు కొనుగోలు కేంద్రాలలో కావలసిన కనీస వసతులు ఏర్పాటు చేసుకొని, మార్కెటింగ్ శాఖ నుంచి కావలసిన సామాగ్రిని తీసుకొని ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ జయదేవ్ ఆర్య, డి ఎం సిఎస్ సి ప్రవీణ్, డి సి ఎస్ ఓ తనూజ, డీఈవో రాధిక, డీఎస్‌ఓ నాగమణి, డి ఎం ఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.