calender_icon.png 25 November, 2024 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పులు ఉండొద్దు

25-11-2024 02:24:05 AM

  1. సమగ్ర కుటుంబ సర్వేలో డాటా ఎంట్రీ కీలకం 
  2. ముగింపు దశకు చేరుకున్న ఇంటింటి సర్వే
  3. తాళాలు వేసిన, వలస వెళ్లిన వారి వివరాలు సేకరించండి
  4. అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): కులగణన సర్వేలో భాగంగా సేకరించిన డాటాను ఆన్‌లైన్ చేసే క్రమం లో ఎలాంటి తప్పులు జరుగొద్దని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారు లను ఆదేశించారు. డాటా ఎంట్రీలో నాణ్యత చాలా కీలకమని పేర్కొన్నారు.

ఆదివారం జార్ఖండ్‌లోని రాంచీ నుంచి సమగ్ర కుటుంబ సర్వేపై ఉన్నతాధికారు లు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచన చేశారు. సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు వచ్చిందని చెప్పారు.

క్షేత్ర స్థాయిలో కొందరు ఇళ్లకు తాళాలు వేసి పనులకు వెళ్లడం, మరికొందరు వలసలు వెళ్లడంతో ఆయా కుటుంబాల సర్వే చేయడంలో ఇబ్బందులు ఎదరవుతున్నాయని అధికారులు భట్టికి వివరించారు. అలా ఇళ్లకు తాళాలు వేసి ఉన్న వారి వివరాలను సేకరించాలని సూచించారు. కనీసం ఫోన్లో అయినా వారు అందుబాటులో ఉండేటా చూసుకోవాలని చెప్పారు. 

ఫుడ్ పాయిజన్ ఘటనలపై కఠిన చర్యలు

రాష్ట్రంలోని కొన్ని వసతి గృహాలు, రెసిడెన్సియల్ పాఠశాలల్లో ఇటీవల ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతుండటంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు, హాస్టళ్లలో ఆహారం, పరిశుభ్రతపై సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రి వర్గం మొత్తం  ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.

ఫుడ్ పాయిజన్‌పై ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి సమస్యలు రావొద్దనే రాష్ట్ర ప్రభుత్వం మెస్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచినట్లు చెప్పారు. వసతి గృహాలు, రెసిడెన్సియల్ పాఠశాలల్లో అపరిశుభ్రతకు తావులేకుండా ఉండేందుకు కార్యచరణ రూపొందించడానికి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు.

వీసీలో ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కూమార్ సుల్తానియా, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, జీహెచ్‌ఎంసీ కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.