calender_icon.png 28 April, 2025 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సమస్యల పరిష్కరంలో జాప్యం తగదు

27-04-2025 09:43:41 PM

పాలకుల నిర్లక్ష్యంపై పోరాటానికి సిద్దం కావాలి..

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య..

కామారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా పక్కన పెట్టిందని ధ్వజమెత్తారు. జర్నలిస్టుల సమస్యల విషయంలో పాలకులు ఇంకా నిర్లక్ష్యం చేస్తే పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా పోరాటానికి జర్నలిస్టులు సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆదివారం కామారెడ్డిలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా తృతీయ మహాసభ ఘనంగా నిర్వహించారు. జిల్లా కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ కృష్ణమాచారి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు తీరని అన్యాయం చేసిందని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం బాటలోనే నడుస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా జర్నలిస్టులకు కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వలేక పోయిందని, ఇళ్ళ స్థలాల విషయంలో చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు.

జర్నలిస్టుల సమస్యల ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంపై పాత్రికేయుల పోరాటం తప్పదని అన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ జర్నలిస్టు యూనియన్ గా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఒక్కటే జర్నలిస్టులకు అండగా ఉంటూ సమస్యలపై పోరాడుతుందని అన్నారు. రాష్ట్రవ్యాపితంగా ఫెడరేషన్ కు జర్నలిస్టుల నుంచి విశేష స్పందన లభిస్తుందని, త్వరలో అన్ని జిల్లాల్లో మహాసభలు పూర్తి చేసి రాష్ట్ర మహాసభలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని అన్నారు. రాను రాను జర్నలిస్టుల పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయని, ఒకవైపు యాజమాన్యాలు,ప్రభుత్వాలు పట్టించుకోక, మరోవైపు దాడులు,అవమానాలు పెరిగిపోతున్నాయని మామిడి సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు శిక్షణతో కూడిన వృత్తి నైపుణ్యతను పెంపొందించుకొని విధినిర్వహణలో సమర్ధవంతంగా ముందుకు సాగాలని సూచించారు.

రాష్ట్రంలోని కొన్ని జర్నలిస్టు సంఘాలు ప్రజల,పాత్రికేయుల పక్షం కాకుండా పాలకుల పక్షాన నిలిచి జర్నలిస్టుల సమస్యలను విస్మరించాయని విమర్శించారు. టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ పాలకుల పక్షం కాకుండా కేవలం పాత్రికేయుల పక్షాన నిలిచి సమస్యలపై పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సంఘంలో ఉన్న పాత్రికేయులు కూడా ప్రజల పక్షం ఉండాలని, ప్రజల సమస్యలపై స్పందించాలని కోరారు. ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్, తాటికొండ కృష్ణ, కార్యదర్శి గండ్ర నవీన్ తదితరులు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు జర్నలిస్టులను పూర్తిగా విస్మరించాయని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు తీరని అన్యాయం చేసిందని అన్నారు.

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు రాకపోవడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు వంటి సమస్యలను పరిష్కరించాల్సివుందని, హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో ఫెడరేషన్ జరుపబోయే ఉద్యమాల్లో జర్నలిస్టులు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ మహాసభలో ఫెడరేషన్ జిల్లా నాయకులు కృష్ణమూర్తి, మోహన్, బి. ప్రవీణ్ గౌడ్, కరుణాకర్, జమాల్ పూర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గం కార్యవర్గాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. జిల్లా అధ్యక్షుడుగా బి. ప్రవీణ్ గౌడ్, కార్యదర్శిగా కె.కరుణాకర్, ఉపాధ్యక్షులుగా జమాల్ పూర్ లక్ష్మణ్, తిరుపతిరెడ్డి, బి.రాకేష్,సంయుక్త కార్యదర్శులుగా సుంకరి సంజీవ్, మామిండ్ల లింగం, కోశాధికారిగా పి.రాములు, జిల్లా కార్యవర్గ సభ్యులుగా చొప్పదండి స్వాతి, బల్వంత రావు, ధనావత్ రాములను మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.