కరీంనగర్ (విజయక్రాంతి): రైతులకు ధాన్యం డబ్బుల చెల్లింపులో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం సివిల్ సప్లై అధికారులు, వరి ధాన్యం కొనుగోలు ఏజెన్సీల అధికారులు, రైస్ మిల్లర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మిల్లులకు సరఫరా చేసే ధాన్యానికి బ్యాంకు గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరి అని అన్నారు. పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎటువంటి అవకతవకలకు తావివ్వకుండా రైస్ మిల్లులకు బ్యాంకు గ్యారంటీ ఆధారంగా కేటాయింపు చేయడం జరుగుతుందని ప్రభుత్వం పాలసీ నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. వడ్లను తప్ప, తాలు, తేమ లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు చెప్పాలి అని సూచించారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎటువంటి బకాయిల చరిత్ర లేని మిల్లర్లు, మిల్లింగ్ సామర్థ్యంపై 10 శాతం బ్యాంకు గ్యారంటీ/ 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ గతంలో బకాయిలు ఉండి సకాలంలో పెనాల్టీతో సహా చెల్లించిన మిల్లర్లు 20 శాతం బ్యాంకు గ్యారంటీ/25 శాతం సెక్యూరిటీ డిపాజిట్, వంద శాతం బకాయిలు చెల్లించి 25 శాతం పెనాల్టీతో డిఫాల్ట్ ఉన్న మిల్లర్లు 25 శాతం బ్యాంకు గ్యారంటీ/ 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించాలని అన్నారు. రైస్ మిల్లులకు ధాన్యం మొత్తం కేటాయింపుల ప్రకారం బ్యాంకు గ్యారంటీ తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం శుభ్రం చేయకుండా కొనుగోలు చేయవద్దని ఆదేశాలు జారీ చేశామని, మిల్లుల వద్ద తాలు పేరుతో ఎటువంటి కోతలు విధించడానికి వీలు లేదని కలెక్టర్ తెలిపారు.
రైస్ మిల్లుల వద్ద హామాలీల కొరత లేకుండా చూసుకోవాలని అన్నారు. నాణ్యమైన ధాన్యానికి కూడా కోతలు విధించాలని ప్రయత్నిస్తే మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. మిల్లర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికీ తీసుకుని వెళ్తామని కలెక్టర్ మిల్లార్ల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) లక్ష్మీ కిరణ్, సివిల్ సప్లై డీఎం రజనీకాంత్, డీఎస్ఓ నర్సింగ రావు, డీసీఓ రామానుజాచారి, అధికారులు, బాయిల్డ్ రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగారావు, ఉపాధ్యక్షుడు అశోక్ రావు, రా రైస్ మిల్లుల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్, ఉపాధ్యక్షుడు సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.