calender_icon.png 23 January, 2025 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెట్ల రక్షణకు యంత్రాంగం ఉండాలి:హైకోర్టు

03-07-2024 12:53:41 AM

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో చెట్ల పరిరక్షణకు తీసుకునే చర్యలు ఏమిటో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చెట్ల రక్షణకు ప్రత్యేక యంత్రాంగం లేకపోతే తామే ఆ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. కర్ణాటకలో ప్రత్యేక అధికారులున్నారని, ఆ విధానాన్ని అధ్యయనం చేయాలని సూచించింది. ఈ నెల ౪వ తేదీవరకు గడువు ఇస్తున్నామని చెప్పింది. పట్టణాలు, నగరాల్లో ప్రజల జీవితాలు ఉరుకులు పరుగులుగా మారిన నేపథ్యంలో జనానికి ఊరట పొందేందుకు పార్కులు ఎంతో అవసరమని, ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ పరిరక్షణ ఎంతగానో దోహదపడుతుందంటూ హైదరాబాద్ హిమాయత్‌సాగర్‌కు చెందిన కే ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో 2016లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.

దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం మంగళవారం విచారించింది. రాష్ట్రంలో చెట్ల పరిరక్షణకు ఓ ప్రత్యేక చట్టం, అధికారులున్నారా? అని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రశ్నించింది. ఆ విషయం గురించి తెలుసుకొని చెప్పటానికి సమయం కావాలని ఏఏజీ విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో చెట్ల సంరక్షణకు ప్రత్యేక చట్టం ఉందని.. అందులో సెక్షన్ 3, 7ను చదవాలని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను రెండు రోజులకు వాయిదా వేసింది.