26-04-2025 12:45:40 AM
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
సిరిసిల్ల, ఏప్రిల్-25(విజయక్రాంతి): మాదకద్రవ్యాల నియంత్రణకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని ఎస్పీ మహేష్ బి గీతే తో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలో నమోదవుతున్న ఎన్.డి.పి.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాధక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు.
పాఠశాలలో ముగుస్తున్నందున పరిసరాల్లో ఉన్న పాన్ షాప్ వంటి వాటి పై నిఘా పెట్టాలని అన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా చూడాలని అన్నారు. ప్రతి మండలంలో తహసిల్దార్, ఎంపిడిఓ, పోలీస్, మండల వ్యవసాయ అధికారి వైద్య అధికారులు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి డ్రగ్స్ నియంత్రణ ప్రణాళిక రూపోందించాలని అన్నారు. డ్రగ్స్ నియంత్రణ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, అవగాహన కార్యక్రమాల్లో డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే నష్టాలు వివరించే వీడియోలను, పోస్టర్లను ప్రదర్శించాలని అన్నారు.
కళాశాలలో సడన్ గా వింతగా ప్రవర్తించే విద్యార్థులను గుర్తించాలని, ఎవరైనా డ్రగ్స్ గంజాయి తీసుకుంటున్నట్లు తెలిస్తే వారికి అవసరమైన కౌన్సిలింగ్ అందజేయాలని అన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ అధికారీ రాధా బాయి , అసిస్టెంట్ లేబర్ అధికారి నాజర్ అహ్మద్, డ్రాగ్ ఇన్స్పెక్టర్ భవాని, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష,విద్యా, వ్యవసాయ శాఖ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.