07-03-2025 12:39:58 AM
పెబ్బేరు, మార్చి 6: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. అంతర్జాతీయ మానవ హక్కుల సమితి ఆధ్వర్యంలో గురువారం పెబ్బేరు మున్సిపాలి టీలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో సైబర్ నేరాలపై పోలీసులు ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలు బాగా పెరిగాయన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో విద్యావంతులే అధికంగా మోసపోతుండడం బాధాకరమని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ళు డిజిటల్ అరెస్ట్, సైబర్ స్టాకింగ్, వర్క్ ఫ్రమ్ హోం పేరుతో ఆకార్షిస్తూ కొన్ని సార్లు భయబ్రాంతులకు గురి చేసి డబ్బులు కాజెస్తారని వివరించారు.
ఇంటర్నెట్ వినియోగం, సోషల్ మీడియాను సరైన పద్దతిగా వాడాలన్నారు. సైబర్ నేరగాళ్ళు డబ్బు ఆశచూపి ఫోన్లో ఉన్న డేటాను తస్కరిస్తారించి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును కొట్టేస్తారని పేర్కొన్నారు. బాధితులు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఫోన్ చేయాలని సూచించారు.
చిన్న చిన్న పిల్లలు గంజాయికి అలవాటై బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి తాగడం, విక్రయించడం తెలిస్తే 100డయాల్ కు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా ఉంచుతామన్నారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వరాదని సూచించారు.
ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం చేయడంతో తరచూ ప్రమాదాలు జరిగి అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ వాసుదేవ రావు, ఎస్సు హరిప్రసాద్ రెడ్డి, ఎంఈఓ జయరాములు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.