calender_icon.png 28 October, 2024 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవ్ పార్టీపై సమగ్ర దర్యాప్తు జరగాలి

28-10-2024 02:34:00 AM

  1. గతంలో కేసీఆర్ ఫాంహౌజ్ ఫైల్స్..
  2. అంటూ 3 గంటల సినిమా చూపారు
  3. రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం ఇవ్వాలి
  4. రైతుబంధు రాబందుల పాలైంది
  5. కాంగ్రెస్ హామీలన్నీ ఉత్తుత్తివే
  6. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శ

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందో లేదో తేలాల్సిన అవసరం ఉందన్నారు.

సీఎం బంధువైనా, మాజీ సీఎం బంధువైనా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలి అనేదే బీజేపీ విధానమని స్పష్టంచేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అనుమతి లేకుండా లిక్కర్ సరఫరా చేశారని పోలీసులు చెప్పినట్లుగా టీవీల్లో చూశానని అన్నారు.

డ్రగ్స్‌పై పూర్తిస్థాయి విచారణ కొనసాగాలని, చట్టం తన పని తాను చేయాలని పేర్కొన్నారు. ఈ అంశంలో ప్రభుత్వం  కావాలని కేసులు పెడుతున్నట్లుగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. 

కేసీఆర్ అప్పట్లో 3 గంటల సినిమా చూపించారు

గతంలో ఫాంహౌస్ ఫైల్స్‌తో కేసీఆర్ మూడున్నర గంటలు అందరికీ సినిమా చూపించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఆ స్వామీజీ ఎవరో ఇంతవరకు మాకు తెలియదని అన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వడానికి పోయి డబ్బులతో దొరికిపోయాడని అన్నారని, కానీ ఆ కేసులో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా డిపాజిట్ చేయలేదని తెలిపారు.

దొంగ వీడియోలు తీసి, ఫోన్ ట్యాపింగ్‌లు చేసి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు, హైకోర్టు జడ్జిలకు ఆధారాల పేరిట కేసీఆర్ పంపించారని విమర్శించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఢిల్లీ కుట్ర చేసిందని, తాను చెప్పే విషయాలు విని భూమి బద్ధలవుతుందని, ప్రపంచమంతా నివ్వెరపోతుం దని కేసీఆర్ హంగామా చేశారని, అదంతా కుట్ర అని ఆయన హయాంలోని పోలీసులే ఇప్పుడు వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు.

రాజకీయాలను ఈ రకమైన వ్యవహారాల చుట్టు తిప్పవద్దని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సూచించారు. రెండు పార్టీలలోని నేతలు ఘనాపాటీలేనని ఎద్దేవా చేశారు. రాష్ర్టంలో మొదటి శిఖండి కేటీఆర్ అని, కాంగ్రెస్ పార్టీకి కూడా కేటీఆరే శిఖండి అని విమర్శించారు.  

రాష్ర్ట ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి

తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారని, పది నెలల్లో కాంగ్రెస్ మరింత భ్రష్టుపట్టించిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వస్తే రాష్ర్టం బాగు పడుతుందని నమ్మి ప్రజలు మోసం పోయారని అన్నారు. 10 నెలల్లో జరిగిన ఒప్పందా లు, అప్పులు, ప్రభుత్వ స్థిరాస్తులు, రాష్ర్ట ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ర్టం నిరసనలతో అట్టుకుడుకుతోందని, అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు ఎవరికీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పులు.. ఈ పది నెలల్లో అసలు ఎంత? వడ్డీ ఎంత చెల్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఎంత అప్పు చేసింది? బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయా? ఊడా యా? ఎన్ని పథకాలున్నాయి? ఎన్ని రద్దు చేశారు? కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంటి? వీటికి ఎంత ఖర్చు అవుతుంది? మిగతా ప్రభుత్వ ఖర్చులెంత? అభి వృద్ధి పనులకెంత? రోడ్లు, పాఠశాలలు, హాస్టల్స్ నిర్మాణం వంటి విషయాలు ఎలా అమలు చేస్తారు? దళితులు, మైనార్టీలు, యువత, రైతాంగంపై ప్రవేశపెట్టిన ప్రత్యేక కార్యక్రమాల నివేదిక ఏంటి? అని నిలదీశారు.

ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూ ర్చుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. ఏయే భూములు అమ్మాలనుకుంటున్నారని నిలదీశారు. మూసీలో భూములు ఎంతమేర అమ్ముతారో లేదా ఆక్రమించుకుంటారో ప్ర భుత్వం చెప్పాలని అన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో దోపిడీ చేస్తే.. కాంగ్రెస్ 10 నెలల కాలంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని విమర్శించారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపో యాయి.. ఫ్లాట్లు, ప్లాట్లు కొనే పరిస్థితి లేదు.. పరిశ్రమల స్థాపన ఆగిపోయిందని అని ఆందోళన వ్యక్తంచేశారు. 

ప్రజలే బుద్ధి చెప్తారు

హైడ్రా, మూసీ పేరుతో నోరు లేని పేద ప్రజలపై ప్రతాపం చూపిస్తే పాలకులకు ప్రజలే సరైన బుద్ధి చెప్తారని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కారు స్మృతిఘాట్‌లో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తాము ఆహ్వాని స్తామని తెలిపారు.

రాష్ట్రంలో ఆందోళన చేస్తున్న పోలీసులతో ప్రభుత్వం చర్చలు జరపాలని, వారి ఇబ్బందులను పరిష్కరించేందుకు కృషి చేయాల ని సూచించారు. బెటాలియన్ కానిస్టేబుళ్లలో సామాన్య పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువగా ఉంటారని, వారిపై కఠినంగా వ్యవహరించ వద్దని కోరారు. కక్షసాధింపు చర్యలు తీసుకోవద్దని హితవు పలికారు.