ప్రధానోపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలి..
ఎమ్మెల్సీ అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి..
మునుగోడు (విజయక్రాంతి): ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన హామీ ప్రకారము సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానమునే కొనసాగించాలని వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలో వివిధ ఉపాధ్యాయ, అధ్యాపకులను కలిసి ఓట్లను అభ్యర్థించి మాట్లాడారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మంత్రుల కమిటీని వేసిన ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. ప్రధానోపాధ్యాయుడు అకాడమిక్ పని మాత్రమే ఉండాలి మధ్యాహ్న భోజనంతో బోధనకు దూరమవుతున్నారు, మధ్యాహ్న భోజనానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి, టీచర్లు తమ అవసరాల కోసం పెట్టుకున్న జిపిఎఫ్, జిఐఎస్ లోన్లు, సరెండర్ లీవులు బిల్లులు గత ఏడాది నుంచి పెండింగ్లో ఉన్నవి, పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులకు రావలసిన బెనిఫిట్స్ వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యోగ విరమణ వయసు పెంచే ఆలోచనను విరివించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినట్లుగానే తెలంగాణలో కూడా స్పెషల్ టీచర్లకు నేషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చి పెన్షన్ కు బెనిఫిట్ కల్పించాలని, తనను శాసనమండలికి గెలిపిస్తే అన్ని యజమాన్యాలు ఎయిడెడ్ మోడల్ స్కూల్స్ గురుకుల కేజీబీవీ పాఠశాలల ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో పద్దు ద్వారా వేతనాలు చెల్లింపులు జరుపుటకు, యూనివర్సిటీ, మెడికల్, అగ్రికల్చర్, వెటర్నరీ, ఇంజనీరింగ్, నవోదయ కేంద్ర పాఠశాలలో అధ్యాపకుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారము నకు కృషి చేస్తానని అన్నారు. జేఏసీ జిల్లా నాయకులు డాక్టర్ తోట నరసింహ చారి మాట్లాడుతూ... పన్నాల గోపాల్ రెడ్డికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము, విద్యార్థి దశ నుండి ఉద్యమ స్ఫూర్తి కలిగి అనేక సామాజిక ఉద్యమాలలో పాల్గొన్న ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణ పొందినప్పటికీ విద్యారంగా సమస్యల పట్ల స్పందిస్తూ పనిచేస్తున్నారు. ప్రశ్నించే గొంతుకు అయిన ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు పన్నాల గోపాల్ రెడ్డిని అధ్యాపక, ఉపాధ్యాయులు అందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాగర్, మురళి తదితరులు పాల్గొన్నారు.