18-04-2025 01:17:26 AM
భూమి కంటే 2.6 రెట్ల పెద్దదిగా ఆ గ్రహం
భారత సంతతి శాస్త్రవేత్త మధుసూదన్ నేతృత్వంలో కేంబ్రిడ్జి పరిశోధక బృందం వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: కేవలం భూమి మీద మాత్రమే కాకుండా సౌర వ్యవస్థ అవతల వేరే గ్రహాల మీద కూడా జీవరాశి మనుగడ సాగిస్తుందని నమ్ముతున్న శాస్త్రవేత్తలు ఆ దిశగా విజయం సాధించారు. కే2 18బీ అనే గ్రహంపై వాతావరణాన్ని అధ్యయనం చేస్తున్న కేంబ్రిడ్జి పరిశోధక బృందం అక్కడ కొన్ని అణువుల సంకేతాలను గుర్తించింది. ఈ పరిశోధకుల బృందానికి భారత సంతతి శాస్త్రవేత్త మధుసూదన్ నేతృత్వం వహించారు.
భూమిపై జీవప్రక్రియల ద్వారా మాత్రమే ఉత్పత్తి అయ్యే వాయువుల రసాయన వేలిముద్రలకు అక్కడి వాతావరణంలో గుర్తించారు. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (జేడబ్ల్యూఎస్‌టీ) ద్వారా ఇది కనుగొన్నారు. ఇలా కనుక్కోవ డం ఇది రెండోసారి. ఈ ఫలితాలను నిర్ధ్దారించేందుకు మరింత సమయం పట్టే అవ కాశం ఉందని ఆ బృంద సభ్యులు చెబుతున్నారు.
మరింత స్పష్టమైన ఆధారాలు త్వరలోనే లభిస్తాయని నమ్ముతున్నట్టు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన మధుసూదన్ తెలిపారు. ఆయన కేంబ్రిడ్జి యూని వర్సిటీ ఆస్ట్రానమీ ఇనిస్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆయన మాట్లాడుతూ.. ‘సౌరవ్యవస్థ అవతల జీవరాశి మనుగడ కోసం వెతుకుతున్న మాకు ఇది ఒక అద్భుత క్షణం. అక్కడ మనిషి జీవిం చి ఉండొచ్చని నమ్మేందుకు ఇది బలమైన ఆధారం. మరో రెండు సంవత్సరాల్లో దీనిని ధ్రువీకరిస్తామని నమ్ముతున్నా’ అన్నారు.
భూమి కంటే 2.6 రెట్ల పెద్దది
కే2 అనే గ్రహం భూమితో పోల్చినపుడు పరిమాణంలో రెండున్నర రెట్ల మేర పెద్దది. ఈ గ్రహం భూమి నుంచి 124 కాం తిసంవత్సరాల దూరంలో ఉంది. జీవంతో ముడిపడి ఉన్న కనీసం రెండు అణువుల్లో ఒకదానికి సంబంధించిన రసాయన సంకేతాన్ని కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు ఆ గ్రహం వాతా వరణంలో గుర్తించారు. ఆ రెండు వాయువులు డైమిథైల్ సల్ఫైడ్ (డీఎంస్), డై మిథైల్ డై సల్ఫైడ్ (డీఎండీస్).
భూగ్రహం మీద ఈ వాయువులను మెరైన్ ఫైటోప్లాంక్టన్ బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువుల గురించి మధుసూదన్ మాట్లాడుతూ.. ‘ఈ వాయువు భూమ్మీద ఉండే మొత్తం కంటే కే2 గ్రహంపై వేల రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉందని మా అంచనా. ఈ వాయువుకు, జీవానికి సంబంధం ఉండటం నిజమే అయితే ఈ గ్రహం ప్రాణులతో నిండి ఉంటుంది.’ అని ఆయన తెలిపారు.
రెండు, మూడు సార్లు పునరావృతం కావాలి
మనం చూస్తున్న సిగ్నల్ బలంగా ఉందని నిర్ధారించుకునేందుకు ఒకటికి రెండు సార్లు పునరావృతం చేయాలని మధుసూదన్ తెలిపారు. ‘కే2 లాంటి గ్రహ వాతావరణంలో డీఎంఎస్, డీఎండీఎస్ తయారు చేసేందుకు మరొక అబియోటిక్ మెకానిజం ఉందో లేదో నిర్ధారించుకోవడం అవసరం. అందుకోసం మనకు మరిన్ని ప్రయోగాత్మక అధ్యయనాలు కావాలి. ఇంత ముందుగానే ఏదో సాధించామని చెప్పుకోవడం సరికాదు’ అని తెలిపారు.
ఇప్పుడే ఆవిష్కరణ అనలేం
ఈ గ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందని తాము గుర్తించిన విషయం ఇంకా నిర్ధరణ కాలేదని అందువల్ల దీన్ని ఇప్పుడే ఆవిష్కరణ అని చెప్పలేమని వా రు పేర్కొన్నారు. మన సౌరవ్యవస్థ ఆవల ఎక్సోప్లానెట్స్ అని పిలువబడే 5,800 గ్రహాలు ఉండగా..
ఏ ఒక్కదానిపై కూడా ఇంకా పూర్తిగా జీవం ఉన్నట్టు గుర్తించలేదు. అయితే ప్రస్తుతం శాస్త్రవేత్తలు కే2 18బీ వాతావరణంలో మీథేన్, కార్బన్‌డైఆక్సైడ్‌లను గుర్తించారు. సౌరవ్యవస్థకు ఆవల ఓ గ్రహంపై కార్బన్ ఆధారిత అణువులను కనుక్కోవడం ఇదే మొదటిసారి.