calender_icon.png 28 September, 2024 | 12:52 AM

మా తీర్పులో తప్పేమీలేదు

27-09-2024 12:48:28 AM

  1. గుజరాత్ సర్కార్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ 
  2. బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల అంశంలో.. 
  3. ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తొలగించేందుకు నిరాకరణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో దోషుల విడుదలకు సంబంధించి తమ ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తొలగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం కొట్టివేసింది. బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషులను ప్రభుత్వం విడుదల చేయడంపై జనవరి 8న ఇచ్చిన తీర్పులో న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలను గుజరాత్ సవాలు చేసింది. ఈ మేరకు తమను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలను తొలగించాలని సుప్రీంకోర్టులో గుజరాత్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతికూల వ్యాఖ్యలు చేయరాదని వాదించింది. 

2002 గుజరాత్‌లో గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి ఆమె కుటుంబాన్ని చంపిన కేసులో దోషులుగా ఉన్న 11 మందిని ముందస్తుగా విడుదల చేయడంపై జనవరిలో సుప్రీంకోర్టు ఆగ్రహించిన విషయం తెలిసిందే. శిక్షాకాలం ముగియ కముందే సత్ప్రవర్తనను కారణంగా చూపి విడుదల చేయడాన్ని ఆక్షేపించింది. వారిని వెంటనే జైలులో లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ అంశంపై విచారణ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వంపై న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. దోషులను విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఇది చట్ట ఉల్లంఘనేనని స్పష్టంచేసింది. గుజరాత్ సర్కార్ దోషులతో కుమ్మక్కైందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడింది.