calender_icon.png 7 November, 2024 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజ్జర్ కేసులో గొప్ప విషయాలేమీ లేవు

14-05-2024 02:15:24 AM

విచారణలో ఎలాంటి కీలక అంశాలు కెనడా పంచుకోలేదు

భారత్ దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తుంది

ముంబై, మే 13: ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్ హత్య కేసు విచారణలో చెప్పుకోదగ్గ అంశాలేవి భారత్‌తో కెనడా పంచుకోలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. నిజ్జర్ కేసులో కెనడా ప్రభుత్వం నాలుగో అరెస్ట్ చేయడంపై  ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను ప్రశ్నించగా ఈ విధంగా చెప్పారు. భారత్ విచారణకు సహకరిస్తుం ది. అయితే ఇప్పటివరకు ఎలాంటి కీలకమైన సమాచారం అక్కడి దర్యాప్తు  సంస్థలు వెల్లడించలేదు. కొన్ని రోజులుగా ఈ కేసులో ఏం జరిగిందో తనకు తెలియదు. వాస్తవానికి భారత్, కెనడా మధ్య చర్చలు జరిగాయి. మీరు వేర్పాటువాదులు, నేరగాళ్లు, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారని చెప్పాం. వారిలో చాలా మందిని భారత్‌కు అప్పగించాలని కోరాం. మా దౌత్యవేత్తలకు పొంచి ఉన్న ముప్పుపై వారి వద్ద చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేశాం అని జైశంకర్ వివరించారు. 

శాశ్వత సభ్యత్వంపై ఆశాభావం

ఇక చైనా సరిహద్దు వివాదంపై మాట్లాడుతూ.. 1958 మధ్యలో భారత్ భూ భాగాన్ని చైనా లాక్కుందని, అయితే కాంగ్రెస్ ఆ విషయాన్ని తప్పుదోవ పట్టించేలా ఆక్రమణ నిజమే కానీ అది 1962లో జరిగిందని మాత్రం చెప్పరని విమర్శించారు. వాళ్ల తప్పు ఏమీ లేదన్నంటే వ్యవహరిస్తారని ఆరోపించారు. చైనా నుంచి సవాళ్లు ఉన్నా యి. రెండు దేశాల మధ్య ఒప్పందాలను డ్రాగన్ ఉల్లంఘిస్తోంది. సరిహద్దుల్లో చైనా భారీగా సైనికులను మోహరిస్తే.. మన దేశం కొవిడ్‌ను ఎదుర్కొంటూనే దీటుగా మోహరింపులు జరిపాం.

సైన్యానికి మద్దతుగా ఉండటం పోయి వారిని, ప్రజలను తక్కువ చేసిన మాట్లాడటం బాధాకరం అని వివరించారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంపై వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐరాసలో సంస్కరణలకు ప్రపంచ దేశాలు సానుకూలంగా ఉన్నాయని, చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ విషయంలో చాలా దేశాలు భారత్‌కు మద్దతునిస్తున్నాయని తెలిపారు.