calender_icon.png 28 October, 2024 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్‌లో తెలంగాణ అనే పదమే లేదు!

24-07-2024 01:43:27 AM

కేటాయింపుల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు మొండిచెయ్యి

బీజేపీ రాజకీయ ప్రేరేపిత బడ్జెట్ ఇది

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అనే పదమే కనిపించలేదని, బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం రాష్ట్రానికి మొండిచేయి చూపిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిధుల కేటాయింపులో రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించడం దారణమని అభిప్రాయపడ్డారు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత బడ్జెట్ అని అభివర్ణించారు. మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూలను ప్రసన్నం చేసుకు నేందుకు బడ్జెట్ కేటాయింపులు జరిగాయని ఆరోపించారు. నిధుల కేటాయింపులో పక్షపాత ధోరణిని కనిపిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు.  బడ్జెట్ సమావేశంలో తెలంగాణ అనే పదమే లేదని నిప్పులు చెరిగారు. 

నిధులివ్వాలని విజ్ఞప్తి చేసినా నిరాశే..

సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం ఏడు నెలలుగా అన్ని మంత్రిత్వ శాఖలకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినా ప్రయోజనం లేకపోయిందని మంత్రి ఉత్తమ్ వాపోయారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై ఎలాంటి హామీ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇచ్చిన హామీ సంగతి ఏమైందని కేంద్రాన్ని ప్రశ్నించారు.

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, హైస్పీడ్ రైలు కనెక్టివిటీ సహా చట్టంలో చేసిన ఇతర వాగ్దానాలను ఎందుకు నెరవేర్చలేదని నిలదీశారు. ఏపీలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తున్నదని, కానీ తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాల ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రులు జీ కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్ సహా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా బడ్జెట్‌లో తెలంగాణకు తగిన వాటాను పొందలేకపోవడం దురదృష్టకరమన్నారు. వనరులు, సంక్షేమ పథకాల్లో వాటా దక్కకుండా చేసిన కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశ కలిగించిందని అన్నారు.