- కొత్త నిబంధనలపై అన్నదాతల ఆగ్రహం
- భూసారాన్ని బట్టి గింజ పరిమాణంలో తేడా
- సన్నవడ్లకు బోనస్ ఎగవేతకు ప్రభుత్వం ఎత్తులు
- పాత పద్దతిలో కొనుగోలు చేస్తేనే అమ్మకాలు
- లేదంటే ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తాం
హైదరాబాద్, అక్టోబర్ 1౪(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ కొనుగోలు కేంద్రాల్లో సన్నగింజ నిర్ధారణకు కాలిపర్స్ పరికరం ఏర్పాటు చేయడాన్ని అన్నదాతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గింజ నిర్ధారణ కాకుంటే రూ. 500 బోనస్ ఎగొట్టేందుకే ప్రయత్నాలు జరుగుతున్నట్లు విమర్శిస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు ఎప్పడూలేని విధంగా గింజను కొలత వేయడం విచిత్రంగా ఉందన్నారు. పౌరసరఫరాల అధికారులు చూపే పరికరాల ద్వారా గింజను సక్రమంగా గుర్తించకుంటే బోనస్ దక్కదని, ప్రైవేటు వ్యాపారులకు అమ్మకాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఖరీఫ్‌లో సన్నాలు సాగు చేయాలని ప్రకటన చేసి తీరా ధాన్యం కొనే సమయంలో కొర్రీలు పెట్టడం సరికాదని రైతులు అంటున్నారు. గడిచిన ఏడాదిలో సన్నవరిని బహిరంగ మార్కెట్‌లో రూ. 3100వరకు అమ్మకాలు చేశామని, ఈసారి బోనస్‌తో కలిపితే రూ. 2,800లు మాత్రమే వస్తుందని, ఇక్కడి కంటే బయట అమ్మకాలు చేస్తే మేలుగా ఉంటుందని చెబుతున్నారు.
భూసారం బట్టి గింజ పరిమాణంలో తేడా..
ఒక్కో ప్రాంతంలో భూసారాన్ని బట్టి సన్నగింజ పరిమాణంలో తేడా ఉంటుందన్నారు. కొలతల పేరుతో కొర్రీలు పెట్టి బోనస్ ఎగ్గొంటేందుకే తీసుకొచ్చే కొత్త నిబంధనలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ శాఖ సన్నాల కింద ప్రకటించిన జాబితాలో రైతు పండించిన ధాన్యం ఉన్నా కొలతల్లో తేడా వస్తే దొడ్డు కింద పరిగణిస్తే నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు వ్యాపారులు కొనకుండా టాస్క్‌ఫోర్స్..
సన్నాలు ప్రైవేటు వ్యాపారుల వద్దకు వెళ్లకుండా జిల్లా కలెక్టర్ టాస్క్‌ఫోర్సు బృందాలను ఏర్పాటు చేసి సన్నవరి పూర్తిగా ప్రభుత్వం ఏర్పాటు చేసి కేంద్రాల్లో అమ్మకాలు చేసేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సీజన్‌లో 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. వాటిలో సన్నాలు, దొడ్డు వడ్లకు వేర్వేరుగా కేంద్రాలు సిద్ధం చేసింది.
ఖరీఫ్‌లో 60 లక్షల ఎకరాలో వరి సాగు చేయగా.. 146.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. 91లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా సన్నాలను 36.80వేల ఎకరాల్లో సాగు చేయగా, 88 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
ప్రభుత్వం సన్నాల కొనుగోలుపై కొత్త నిబంధన అమల్లోకి తెస్తే గింజ కొలిచి నిర్ధారణ చేసి బోనస్ ఇస్తామని అధికారులు పేర్కొనడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రైవేటు వ్యాపారులకు అమ్మకాలు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తుంది.
పక్కరాష్ర్టంలో అమ్మకాలు ప్రయత్నాలు..
ప్రభుత్వం సన్న గింజను గుర్తించడంలో కఠిన నిబంధనలు అమలు చేస్తే నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, వికారాబాద్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాలకు చెందిన రైతులు పక్క రాష్ట్రాలకు వెళ్లి అమ్మకాలు చేస్తామని పేర్కొంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం సాధారణ సన్నవరిని రూ. 2,300లకు కొనుగోలు చేస్తుండగా, పక్క రాష్ట్రాల్లో క్వింటాల్‌కు రూ.3వేల వరకు సన్నరకం ధాన్యం కొనుగోలు చేస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న బోనస్ కంటే ఎక్కువగా ధర లభిస్తుందని రైతులు వెల్లడిస్తున్నారు.
కాలిపర్స్ పరికరం ద్వారా గింజ నిర్ధారణ..
పొడవు, వెడల్పు కొలతలు లెక్కించటం కోసం వినియోగించే కాలిపర్స్ పరికరాన్ని సన్నధాన్యం గుర్తించేందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వినియోగించనున్నట్లు సమాచారం. ఇందుకు పౌరసరఫరాల శాఖ సంస్థ ఇప్పటికే భారీ సంఖ్యలో కాలిపర్స్ పరికరాల కొనుగోలుకు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రతి కొనుగోలు కేంద్రానికి కనీసం రెండు చొప్పున ఇవ్వాలని నిర్ణ యించినట్లు తెలుస్తోంది.
సన్నవరి గింజలు కొలిచేదిలా
ధాన్యంలో పది గింజలను సేకరించి ప్రత్యేక పరికరంలో వేసి వాటిపై పొట్టుపోయేలా చేస్తారు. తరువాత వచ్చిన బియ్యపు గింజను కాలిపర్స్ ద్వారా గుర్తిస్తారు. బియ్యపు గింజ పొడవు, వెడల్పు నిష్పత్తి 2.5 మిల్లీమీటర్ల కన్నా ఎక్కు వగా ఉండాలి. కాలిపర్స్‌లో పెట్టిన బియ్యపు గింజ ఈ కొలతలకు సరిపోతే దానిని సన్నవడ్లుగా నిర్ధారించి రూ.500 బోనస్ చెల్లిస్తారు.