05-07-2024 01:47:52 AM
తేల్చిచెప్పిన వైట్‌హౌస్
అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకుంటారంటూ ప్రచారం
కొట్టిపారేసిన బైడెన్, వైట్‌హౌస్
వాషింగ్టన్, జూలై 4: అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రాట్ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెనే మరోసారి తలపడతారని వైట్ హౌస్ స్పష్టం చేసింది. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత నుంచి బైడెన్ రేసు నుంచి తప్పుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
బైడెన్ మాకొద్దు బాబోయ్..
అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు మరోసారి అధ్యక్షుడిగా గెలిచేందుకు మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రణాళికలు రచిస్తూ.. ప్రచారంలో జోరు చూపిస్తుంటే.. బైడెన్ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. బైడెన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ అనేక మంది డెమోక్రాట్ చట్టసభ్యులు సంతకాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అంతే కాకుండా బైడెన్ కాకుండా ప్రత్యామ్నాయ అభ్యర్థుల కోసం వెతుకున్నట్లు కొందరు నాయకులు వెల్లడించారు.
బైడెన్ అలా చెప్పలేదు..
అధ్యక్ష ఎన్నికల రేసులో పరిస్థితులు ఇలాగే కొనసాగితే రేసు ‘డిఫరెంట్ ప్లేస్’లో ఉంటుందని బైడెన్ తన వారితో చెప్పినట్లు పలు నివేదికలు బయటకు వచ్చాయి. కానీ అవన్నీ అబద్దం అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జీన్ పియర్ తెలిపారు. మరోమారు బైడెనే అధ్యక్షుడిగా గెలుస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం బైడెన్ ఏబీసీ న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. అలాగే మ్యాడిసన్, విస్కాన్సిన్ ఏరియాల్లో ర్యాలీ చేసేందుకు కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
బాంబు పేల్చిన న్యూయార్క్ టైమ్స్
బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నారని బుధవారం న్యూయార్క్ టై మ్స్ కథనం ప్రచురించింది. ఈ కథనంతో అంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. సొంత పార్టీ నేతలే బైడెన్‌ను తప్పుకోమని ఒత్తిడి తెస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. కానీ ఈ కథనం పూర్తిగా అవాస్తవం అని వైట్ హౌస్ స్పష్టతనిచ్చింది. నేను ఈ రేసులో ఉన్నాను. డెమోక్రాట్ల ఐక్యతతో మరోసారి మనమే గెలవబోతున్నామని ఆయన ఉపాధ్యక్షురాలు కమలా హరిస్‌తో ఫోన్‌లో అన్నారు.
బైడెన్‌కు ఆందోళనే లేదు
మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో బైడెన్ మీద ట్రంప్ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. ఇలా అయితే బైడెన్ గెలవడం కష్టం అని బాహాటంగానే చెబుతున్నారు. కొంత మందితో బైడెన్ భేటీ కాగా.. అందులో ఒకరు మీడియాతో మాట్లాడారు. అసలు మొన్నటి డిబేట్ గురించి బైడెన్ ఆందోళన చెండడం లేదని తెలిపారు. బైడెన్ 36 సంవత్సరాల పాటు సెనేట్‌లో సేవలందించారు. ఇన్ని గందరగోళాల మధ్య ఆయన అభ్యర్థితత్వం గురించి డెమోక్రాట్లు చాలా వరకు నోరు మెదపడం లేదు. బైడెన్ డెమోక్రాటిక్ గవర్నర్లతో సమావేశం అయ్యారు. బై డెన్ వెంటే తాము ఉన్నట్లు కొంత మంది గవర్నర్లు మాత్రమే చెప్పడం గమనార్హం. మేరీలాండ్ గవర్నర్ మూ రే మాట్లాడుతూ.. గెలుపు మీద బైడెన్ ధీమాతో ఉన్నట్లు తెలిపారు.