calender_icon.png 23 October, 2024 | 4:51 PM

ఆ అవకాశమే లేదు

11-07-2024 12:05:00 AM

యష్ రాజ్ ఫిల్మ్స్ వారి స్పై యూనివర్స్ చిత్రాలు బాలీవుడ్ సినీ అభిమానులకు పరిచయమే. ‘ఏక్ థా టైగర్’ మొదలుకొని ‘పఠాన్’ వరకు పలు చిత్రాలు ఈ బ్యానర్‌లో తెరకెక్కాయి. ఇదే కోవలో ఇటీవల ‘ఆల్ఫా’ అనే మరో స్పై యూని వర్స్‌ని ఆరంభించింది ఈ సంస్థ. కండల వీరులు కాకుండా కథానాయికలతో ఈ సినిమా తెరకెక్కనుండటం విశేషం. శివ రవైల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం వర్ధమాన నటి శార్వరితో కలిసి సాహసోపేత పోరాటాలు చేసేందుకు సన్నద్ధమైన ఆలియా ఇటీవల చిత్రీకరణలో పాల్గొన్నారు.

అంతలోనే సినిమాలో ఆలియా పాత్ర లుక్ బయటికొచ్చిందని, తద్వారా సినిమా లీకేజీ బారిన పడిందంటూ వార్తలొచ్చాయి. ఈ విషయం కాస్త చిత్ర వర్గాల దృష్టికి వెళ్ళడంతో “ఇప్పుడు వైరల్ అవుతున్నది ‘ఆల్ఫా’లో ఆలియా అసలైన లుక్ కాదు. సినిమాలో ఆమె లుక్ ఎవరి ఊహలకూ అందనంత గొప్పగా ఉంటుంది” అంటూ వివరణ ఇచ్చాయి. అసలు ‘ఆల్ఫా’ సెట్స్ నుంచి లుక్ లీక్ అయ్యే అవకాశమే లేనంతగా సెట్‌కి భద్రతను కల్పించారట యూనిట్. ‘ది రైల్వే మెన్’ దర్శకుడైన శివ రవైల్ రూపొందిస్తున్న ఈ సినిమాలో సూపర్ ఏజెంట్‌గా కనపడనుంది ఆలియా.