calender_icon.png 13 October, 2024 | 7:58 AM

ఆహార ధరలు తగ్గే సూచనలు లేవు

23-08-2024 12:30:00 AM

హెచ్చరించిన రిజర్వ్‌బ్యాంక్ మానిటరీ కమిటీ

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఆహారోత్పత్తుల ధరల కారణంగా జూన్ నెలలో హెడ్‌లైన్ ద్రవ్యోల్బణం 5.1 శాతానికి చేరిందని, బేస్ ఎఫెక్ట్‌తో రానున్న నెలల్లో ప్రధాన ద్రవ్యోల్బణం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ఆహార ద్రవ్యోల్బణం తగ్గే సూచనలు కన్పించడం లేదని ఇటీవలి రిజర్వ్‌బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్బీఐ మీటింగ్ మినిట్స్ గురువారం వెల్లడయ్యాయి. ఆగస్టు రెండోవారంలో జరిగిన ఆర్బీఐ పాలసీ సమీక్షలో రెపో రేటును యథాతథంగా 6.5 శాతం వద్ద అట్టిపెట్టిన సంగతి తెలిసిందే.

జూలైలో హెడ్‌లైన్ ద్రవ్యోల్బణం తగ్గిందని, ద్వితీయ త్రైమాసికంలోనూ తగ్గుముఖం పడుతుందని, అందుకు గత ఏడాది హయ్యర్ బేస్ కారణమని కేంద్ర బ్యాంక్ వివరించింది. కానీ సమీప భవిష్యత్తులో ఆహార ద్రవ్యోల్బణం తగ్గే సంకేతాలు కన్పించడం లేదని, ఆహారోత్పత్తులపై కుటుంబాల వ్యయం పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో తమ ద్రవ్య విధానం అప్రమత్తంగా ఉంటుందన్నది.

సానుకూల రుతుపవనాలు, ఖరీఫ్ పంట సాగు పెరుగుదల, మెరుగైన రిజర్వాయిర్ స్థాయిలతో ఆహార ద్రవ్యోల్బణం కొంత నెమ్మదించే అవకాశాలు ఉన్నప్పటికీ, తరచూ ఏర్పడుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల తీవ్రతతో ధరలు పెరిగే అవకాశం ఉన్నదని ఆర్బీఐ హెచ్చరించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రిటైల్  ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందని అంచనా వేసింది. ఆహార ద్రవ్యోల్బణం దిగిరావడానికి దీర్ఘకాలం పడుతుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖల్ దేబబ్రత పాత్ర కమిటీ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కఠిన విధానాన్ని వ్యతిరేకించిన జయంత్ వర్మ

రిజర్వ్‌బ్యాంక్ అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానం పట్ల కమిటీ సభ్యుడు జయంత్ వర్మ తప్పుపట్టారు. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి విఘాతం కల్పిస్తుందన్నారు. తాను గత పలు సమావేశాల్లో ఇదే ఆందోళనను వ్యక్తపరుస్తున్నానని, ద్రవ్య విధానాన్ని ఎక్కువ కఠినతరం చేయడం ద్వారా వృద్ధిని పరిమితం చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. అయితే మెజారిటీ ఎంపీసీ సభ్యులు ఈ ఆందోళనను వ్యక్తం చేయడం లేదని, సత్తా ఉన్న మేరకు వృద్ధి రేటు చేరిందన్నది వారి భావన కావచ్చని వర్మ తెలిపారు.

భారత్ మరింత వృద్ధి చెందేందుకు అవకాశాలున్నాయన్నారు. గత కొన్నేండ్లుగా జరిగిన డిజిటలైజేషన్, పన్ను సంస్కరణలు, మౌలిక పెట్టుబడుల పెంపు వంటివి ఆర్థిక వ్యవస్థ 8 శాతం వృద్ధి సాధించేందుకు దోహదపడతాయని వర్మ వివరించారు.  వడ్డీ రేట్ల తగ్గింపును కోరుతూ ఆయన ఓటు చేశారు.

సానుకూల రుతుపవనాలతో ద్రవ్యోల్బణం ఇప్పటికే తగ్గుతున్నదని,  బేస్ ఎఫెక్ట్‌తో మరింత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఆర్బీఐ ద్రవ్యోల్బణం అంచనాల్ని ఎందుకు పెంచిందంటూ రేట్ల కోతకు ఓటుచేసిన మరో కమిటీ సభ్యురాలు అషిమా గోయల్ సమావేశంలో ప్రశ్నించారు. ఎంపీసీలో వర్మ, గోయల్ ఇరువురూ కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇండిపెండెంట్ సభ్యులుకాగా, మిగిలిన సభ్యులుగా ఆర్బీఐ గవర్నర్, అధికారులు ఉంటారు.