calender_icon.png 17 October, 2024 | 4:58 AM

రైతుభరోసా ఏమోగానీ రైతుబంధు కూడా లేదు

17-10-2024 02:37:36 AM

రెండు చీరలు అని ఊదరగొట్టి ఒక్క చీర కూడా ఇవ్వలే 

రుణమాఫీ కోసం అప్పు పుట్టడం లేదు 

ఆర్‌ఆర్‌ఆర్‌కు రూ.20 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు 

మీ లాభం కోసం అలైన్‌మెంట్ మార్చి భారం ప్రజలపై వేస్తారా!

చిట్‌చాట్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): అధికారంలోకి వస్తే రైతుబంధు రూ.10వేలకు బదులు రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. రైతు భరోసా ఏమోగానీ కనీసం రైతుబంధు కూడా లేకుండా బంద్ చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే రెండు చీరలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ లీడర్లు బతుకమ్మ పండగకు ఒక్క చీర కూడా ఇవ్వలేదన్నారు. ‘కేసీఆర్ కిట్ ఆపేశారు.. చేప పిల్లలను చెరువుల్లో వదలడం లేదు.. చేప పిల్లలు తక్కువగా ఇవ్వాలంటూ అధికారులను ఆదేశిస్తున్నారు.. చేప పిల్లలకు టెండర్ పిలవలేదు.. ముదిరాజ్‌లకు, గంగపుత్రులకు తీవ్రమైన అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం.

మార్పుమార్పు అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇవాళ ఈ మార్పులు చేస్తోంది’ అని హరీశ్‌రావు విమర్శించారు. ఆగస్టులో చెరువుల్లో వదలాల్సిన చేప పిల్లలను అక్టోబర్ వచ్చినా వదలలేదు. తాము అధికారంలో ఉన్నప్పుడు రూ. 100 కోట్లు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లల కోసం బడ్జెట్‌లో పెట్టిందే రూ. 16 కోట్లే కేటాయించిందన్నారు.

రూ.20వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు.. 

తమ హయాంలో ఉత్తర, దక్షిణ భాగాలుగా ఆర్‌ఆర్‌ఆర్‌ను ప్రతిపాదించామని.. ఇప్పుడు దక్షిణ భాగాన్ని మారుస్తూ రాష్ట్రమే సొంతంగా నిర్మించేందుకు ఆసక్తి చూపటంతో రాష్ట్ర ఖజానాపై రూ.20 వేల కోట్ల భారం పడుతుందని హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతోన్నా భూసేకరణ ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించారు.

ఉత్తర భాగంలో యుద్ధ ప్రాతిపదికన మార్కెట్ విలువ ప్రకారం రైతులకు డబ్బులు చెల్లించాలన్నారు. ఐసీటీ వారికి దక్షిణ భాగంలో అలైన్‌మెంట్ ఫైనల్ చేయమని నేషనల్ హైవే అథారిటీ వారు చెప్పారని.. 182 కిలోమీటర్ల అలైన్‌మెంట్ పూర్తి కూడా అయ్యిందన్నారు. అయితే తమ భూముల కోసం దక్షిణ భాగం అలైన్‌మెంట్ పూర్తిగా మార్చారని ఆరోపించారు.

ఒక్కసారి ఫైనల్ చేసిన అలైన్‌మెంట్‌ను మారిస్తే ఎన్‌హెచ్‌ఏఐ ఒప్పుకోదన్నారు. ఫలితంగా రాష్ర్ట ప్రభుత్వంపై రూ.20 వేల కోట్ల భారమని తెలిపారు. అలైన్‌మెంట్ మార్చడం వల్ల 182 కిలోమీటర్ల నుంచి 198 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. రుణమాఫీ కోసం అప్పు పుట్టడం లేదని మంత్రి తుమ్మల అంటున్నారని... ఇప్పుడు అలైన్‌మెంట్ మార్చడం వల్ల రూ.20 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు.