calender_icon.png 24 October, 2024 | 9:50 AM

ఐఎంజీపై సీబీఐ దర్యాప్తునకు కారణాల్లేవు

12-09-2024 12:35:32 AM

పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాం తి): ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో 2003లో ఐఎంజీ భారత అకాడమీకి ఇచ్చి న 850 ఎకరాల భూకేటాయింపులపై ఈ దశలో సీబీఐ దర్యాప్తునకు జరిపించడానికి ఎలాంటి కారణాలు లేవని హైకోర్టు తేల్చి చెప్పింది. ఐఎంజీ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్న పిల్‌ను బుధవారం హైకోర్టు కొట్టివేసిం ది.

ఐఎంజీ పేరుతో బోగస్ కంపెనీకి క్రీడాభివృద్ధి నిమిత్తం హైదరాబాద్ గచ్చిబౌలిలో, రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో 850 ఎకరాల భూకేటాయింపులతోపాటు 2003లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ న్యాయవాది టీ శ్రీరంగారావు, ఏబీకే ప్రసాద్, వీ విజయసాయిరెడ్డి 2012లో దాఖలు చేసిన రెండు వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. పిల్ దాఖలు చేసినపుడు పిటిషనర్ల పూర్వాపరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొం ది.

చంద్రబాబు జరిపిన భూకేటాయింపులపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌లో ఐఎంజీ వ్యవహారం ఉందని, ఇందులో ఐఎంజీ ఎండీ అహోబిలరావు అలియాస్ బిల్లీరావు కూడా ప్రతివాదిగా ఉన్నారని గుర్తుచేసింది. హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు కూడా విజయమ్మ పిటిషన్‌ను కొట్టివేసిందని తెలిపింది. విజయమ్మ కుమారుడు జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులో అరెస్టయి జైలులో ఉన్న విజయసాయిరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది. అనంతరం పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ఏసీబీ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయగా కొట్టివేసిందని, హైకోర్టు కూడా కొట్టివేసిందని గుర్తుచేసింది. ఈ విషయాలన్నీ విజయసాయిరెడ్డికి తెలిసినా వాటిని ప్రస్తావిం చకుండా సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారని అసహనం వ్యక్తంచేసింది. 

అదేవిధంగా న్యాయవాది శ్రీరంగారావు ఈ విషయాలను తెలుసుకోకుండా పిటిషన్ వేయడం సరికాదని సూచించింది. 2006లో సీబీఐ దర్యాప్తు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని, ప్రాథమిక దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలంటూ సీబీఐ 2007 జనవరిలో లేఖ రాసిందని తెలిపింది. మరో 8 నెలల తరువాత సెప్టెంబర్‌లో మరో లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక దర్యాప్తు జరిపించి నివేదిక సమర్పించలేదని,  అనంతరం అప్పటి సీఎంపై దర్యాప్తు చేపట్టాలంటూ సీబీసీఐడీకి ఆదేశాలు జారీ చేసినా ఇప్పటివరకు దర్యాప్తు చేయలేదని పేర్కొన్నది. దర్యాప్తు ఎందుకు నిర్వహించలేదో ప్రభుత్వం ఎలాంటి కారణాలనూ చెప్పలేదని, అందువల్ల సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడానికి ఎలాంటి కేసు లేదంటూ తిరస్కరించింది. పిటిషన్‌ను అనుమతించలేమంటూ కొట్టివేసింది.